కేటీఆర్‌ ఛాలెంజ్ స్వీకరించిన పవన్‌ కళ్యాణ్‌

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ చేసిన ఛాలెంజ్ ను సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వీకరించారు. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం. ఈ సందర్భంగా చేనేత వస్త్రాలు ధరించి.. ఫోటోలు, పోస్ట్‌ చేయాలని సచిన్‌ టెండూల్కర్‌, పవన్‌ కళ్యాణ్‌, ఆనంద్‌ మహీంద్రాలకు మంత్రి కేటీఆర్‌ ఛాలెంజ్ చేశారు.

దీంతో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఛాలెంజ్ ను పవన్‌ కళ్యాణ్‌ స్వీకరించారు. దీన్ని స్వీకరించిన పవన్ కళ్యాణ్.. రామ్‌ భాయ్‌ ఛాలెంజ్‌ స్వీకరించాను. చంద్రబాబు, మంత్రి బాలినేని శ్రీనివాస్‌, బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ లకు నామినేట్‌ చేస్తున్నా అంటూ ఫోటోలను షేర్‌ చేశారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ చేసిన ఆ ట్వీట్‌ కు మంత్రి కేటీఆర్‌ థ్యాంక్యూ అన్నా అని సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఈ ట్వీట్‌ వైరల్‌ గా మారింది.

ఇదిలా ఉంటె నేతన్న భీమా పథకాన్ని ఈరోజు (ఆదివారం) కేటీఆర్ ప్రారంభించనున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నల అభ్యున్నతి కోసం ఈ నూతన బీమా పథకాన్ని తీసుకొచ్చారు. రైతు బీమా లాగే నేతన్నకు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 80 వేల మంది నేత కార్మికులు లబ్ధి పొందనున్నారు. 60 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి నేత కార్మికుడు ఈ పథకానికి అర్హుడు. దురదృష్టవశాత్తూ నేత కార్మికుడు మరణిస్తే మృతుడి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందుతుంది.