ఏపీలోని సినిమా థియేట‌ర్ల స‌మ‌స్య‌ల‌పై ఆ రాష్ట్ర మంత్రుల‌తో నేను మాట్లాడ‌తాను

మేము సినీ ప‌రిశ్ర‌మ‌ను ప్రోత్స‌హిస్తున్నాం: మంత్రి త‌ల‌సాని

హైదరాబాద్: ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌లు త‌గ్గించ‌డంపై వివాదం రాజుకున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై సినీ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌తో ఏపీ మంత్రి పేర్ని నాని చ‌ర్చ‌లు జ‌రిపిన‌ప్ప‌టికీ అవి ఫ‌లించ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఏపీలోని సినిమా థియేట‌ర్ల స‌మ‌స్య‌ల‌పై ఆ రాష్ట్ర మంత్రుల‌తో తాను మాట్లాడ‌తాన‌ని తెలంగాణ‌ మంత్రి తలసాని శ్రీ‌నివాస్ యాద‌వ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు తల‌సాని మీడియాతో మాట్లాడుతూ… ఇటీవ‌ల విడుద‌లైన బాల‌కృష్ణ‌ అఖండ సినిమాతో పాటు అల్లు అర్జున్ పుష్ప మూవీ మంచి విజ‌యాలు సాధించ‌డంతో సినీ పరిశ్రమ మ‌ళ్లీ పుంజుకుందని ఆయ‌న చెప్పారు. తాము తెలంగాణలో ఇప్ప‌టికే సినిమా టికెట్ల‌ ధరలు పెంచామ‌ని ఆయ‌న గుర్తు చేశారు. అంతేగాక‌, థియేట‌ర్ల‌లో ఐదో ఆటకు అనుమతులు కూడా ఇచ్చామ‌ని చెప్పారు. తాము సినీ పరిశ్రమకు ఎల్లప్పుడూ అండగా ఉంటున్నామ‌ని తెలిపారు.

సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్ గా ఉండాలని భావిస్తున్నామ‌ని త‌ల‌సాని చెప్పారు. సినిమాకు కులం, మతం, ప్రాంతాల భేదాలు ఏవీ ఉండవని హిత‌వు ప‌లికారు. అది వినోదాన్ని అందించే సాధనమే అని చెప్పారు. ఇండ‌స్ట్రీలోని సమస్యలపై తాము వెంట‌నే సానుకూలంగా స్పందిస్తూ ప‌రిష్క‌రిస్తున్నామ‌ని తెలిపారు. హైదరాబాద్‌లో సినీ పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది బ‌తుకుతున్నార‌ని, ఇక్కడి ప్రభుత్వం సినీ పరిశ్రమపై బలవంతంగా నిర్ణయాలు తీసుకోదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తాము సాధార‌ణంగా సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు పెట్ట‌బోమ‌ని తలసాని శ్రీ‌నివాస్ యాద‌వ్ అన్నారు. అయితే, క‌రోనా స‌మ‌యంలో మాత్రం ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌రంగా ఉంటే ప‌లు నిబంధ‌న‌లను త‌ప్ప‌వ‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే ఆన్‌లైన్ టికెట్ పోర్ట‌ల్‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని తలసాని శ్రీ‌నివాస్ యాద‌వ్ తెలిపారు. కాగా, సినిమా టికెట్ల ధ‌ర‌లు త‌గ్గించి థియేట‌ర్ల‌ను న‌డ‌ప‌డం త‌మ వ‌ల్ల కాద‌ని కొంద‌రు ఏపీ థియేట‌ర్ల య‌జ‌మానులు స్వ‌చ్ఛందంగా వాటిని మూసివేసిన విష‌యం తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/