ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు

గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ను వరుస కేసులు వదలడం లేదు. ఓ కేసు నుండి బయటపడ్డారు అనుకునేలోపే మరో కేసు నమోదు అవుతుంది. రీసెంట్ గా పిడియాక్ట్ కేసు నుండి బయటపడిన రాజాసింగ్ ఫై మరో కేసు నమోదు అయ్యింది. మంగళహాట్ పోలీస్ స్టేషన్లో రాజసింగ్ పై కేసు నమోదు అయింది. ఈనెల 6వ తేదీన తన ట్విట్టర్ ఖాతాలో అయోధ్య పై పోస్టు చేసిన రాజాసింగ్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సంజాయిషీ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.

పిడి యాక్ట్ కొట్టేస్తూ హైకోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారని నోటీసుల్లో పేర్కొన్నారు మంగళహాట్ పోలీసులు. నోటీసులకు రాజసింగ్ తరపు న్యాయవాది సంజాయిషీ ఇచ్చారు. నోటీసుల్లో పేర్కొన్న అంశాలు సంతృప్తికరంగా లేవని పేర్కొన్నారు. మంగళహాట్ పోలీసులు కేసు నమోదు చేయడంపై స్పందించిన రాజాసింగ్.. బాబ్రీ మసీదు పై ఓవైసీ సోదరులు సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. వాళ్లపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. కెసిఆర్, కేటీఆర్, ఓవైసీ సోదరుల మెప్పు పొందేందుకు పోలీసులు పోటీపడి తనపై కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.