వేములవాడలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై

తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. సామాన్య ప్రజానీకంతో రాజకీయ నేతలు సైతం ఉత్సహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. శనివారం గవర్నర్ తమిళిసై రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.

అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా దర్శించుకోవడం, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వెయ్యి సంవత్సరాల చరిత్ర గల పురాతనమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని కాపాడుకోవడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలి… ఆలయ అభివృద్ధి కోసం నా వంతు నేను కూడా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన బతుకమ్మ పండుగ ఉత్సవాల్లో భాగంగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలకు వేములవాడకు రావడం, వేలాది మంది మహిళలతో ఉత్సవాలలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు. బతుకమ్మ పండుగ మొదటి రోజే వేలాది మంది మహిళలతో రాజ్‌భవన్‌లో బతుకమ్మ ఆడామని అంటూ రాష్ట్ర ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.