జమ్మూకశ్మీర్ అనంతనాగ్‌లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ లో భద్రతా దళాలు ఈరోజు కూడా యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. కోకెర్‌నాగ్ ఏరియాలో భారీ స్థాయిలో దళాలు మోహరించాయి. అయితే శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ ఓ సైనికుడు మృతిచెందాడు. దీంతో అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్ మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. కోకెర్‌నాగ్‌లో ఉగ్రవాదులు దాచుకున్నట్లు వార్తలు రావడంతో.. బుధవారం నుంచి అక్కడ ఎన్‌కౌంటర్ మొదలైంది. భద్రతా బలగాలకు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో ఆర్మీకి చెందిన కమాండింగ్ ఆఫీసర్, కంపెనీ కమాండర్, డీఎస్పీ మృతిచెందారు. కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిశ్, డీఎస్పీ హుమాయున్ భట్ మృతిచెందినవారిలో ఉన్నారు. మన్‌ప్రీత్ సింగ్, ఆశిశ్ దోంచాక్ పార్దీవదేహాలను పానిపట్‌లోని స్వగ్రామానికి శుక్రవారమే చేర్చారు.
లష్కరే తోయిబాకు ప్రత్యామ్నాయం అయిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద దళ కాల్పులకు తెగించినట్లు తెలుస్తోంది. కోకెర్‌నాగ్ ప్రాంతంలో సుమారు ముగ్గురు ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. గారోల్ గ్రామంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు మొదలుపెట్టాయి. హీరన్ డ్రోన్లతో పాటు క్వాడ్‌కాప్టర్లను .. నిఘా కోసం రంగంలోకి దింపారు. ఉగ్రవాదులు జరిపిన ఫైరింగ్‌లో ఓ కల్నల్ అక్కడిక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరు అధికారులు తీవ్రంగా గాయపడి ఆ తర్వాత హాస్పిటల్‌లో మృతిచెందారు.