చలో విజయవాడకు అంగన్వాడీల పిలుపు.. పోలీసుల అరెస్ట్‌లు

తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడంలో సీఎం జగన్‌ మొండి వైఖరిని నిరసిస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అంగన్‌వాడీలు విజయవాడకు రాకుండా అడ్డుకునేందుకు పలు జిల్లాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం సుదీర్ఘంగా ఆంధ్రప్రదేశ్లో పోరాటం కొనసాగిస్తున్నారు అంగన్వాడీలు.. వివిధ రూపాల్లో ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించిన అంగన్వాడీలకు వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి..

అయితే, ఎస్మా ప్రయోగించి బలవంతంగా విధుల్లో చేరాల్సిందేనంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.. అయినా వారు వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగిస్తు్న్నారు. అందులో భాగంగా ‘జగనన్నకు చెబుదాం’ పేరిట ఈ రోజు ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను సీఎం వైఎస్‌ జగన్‌కు ఇచ్చేందుకు వస్తున్నామని అంగన్వాడీలు స్పష్టం చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి అనుమతిలేదని పోలీసులు స్పష్టం చేశారు.. మరోవైపు ఛలో విజయవాడ నిర్వహించి తీరుతామని అంగన్వాడీలు ప్రకటించారు.. తమ డిమాండ్లను పరిష్కరించేవరకు ఆందోళన విరమించేది లేదంటున్నారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్ట్‌లు కొనసాగుతూనే ఉన్నాయి.. అంగన్వాడీలతో పాటు.. వారికి మద్దతుగా నిలిచిన పార్టీలు, ప్రజాసంఘాల నేతలను సైతం అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు.