బాల రాముడి ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

మరికాసేపట్లో అయోధ్య లో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో నటుడు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేసారు.

”చరిత్ర సృష్టిస్తుంది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘటం ఇది. నిజంగా అద్భుతమైన అనుభూతి.. అయోధ్యలో రామ్‌లల్లా పట్టాభిషేకాన్ని చూసేందుకు ఈ ఆహ్వానాన్ని భగవంతుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. ఐదు వందల సంవత్సరాలకు పైగా తరతరాలుగా భారతీయుల నిరీక్షణ ఫలించబోతున్న ఆ మహత్తర అధ్యాయం. ఆ దివ్యమైన ‘చిరంజీవి’ హనుమంతుడు, అంజనా దేవి కుమారుడే స్వయంగా ఈ భూలోక అంజనా దేవి కొడుకు చిరంజీవికి ఈ అమూల్యమైన క్షణాలను చూసే బహుమతిని ఇచ్చినట్లు నాకు అనిపిస్తుంది. ఇది నిజంగా వర్ణించలేని అనుభూతి. నాకు, నా కుటుంబ సభ్యులకు ఎన్నో జన్మల పుణ్యఫలం ఇది. గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక అభినందనలు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి జీకి హృదయపూర్వక అభినందనలు. ఈ మహత్తర సందర్భంలో ప్రతి భారతీయునికి హృదయపూర్వక అభినందనలు! ఆ బంగారు క్షణాల కోసం ఎదురు చూస్తున్నా .. జై శ్రీరామ్” అంటూ రాసుకొచ్చారు.

ఎన్నో ఏళ్లుగా కంటున్న కల తీరుతున్న శుభ సందర్భంలో ప్రపంచం మొత్తం అయోధ్యవైపే చూస్తోంది. భారత దేశ చరిత్రలో అత్యంత అద్వితీయమైన, అద్భుతమైన, చిరస్మరణీయమైన ఘట్టం అయోధ్య లో రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం. మధ్యాహ్నం 12.29కి బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధానితోపాటూ… 4వేల మంది సాధువులు పాల్గొంటున్నారు. ఈ మహా కార్యక్రమం కోసం దేశం, విదేశాల నుంచి సెలబ్రిటీలు అయోధ్యకు వచ్చారు. లక్షల మంది భక్తులు తరలివచ్చారు.