చంద్రబాబు తీరు మారాలి

లేదంటే రాజకీయంగా కనుమరుగుకావడం తథ్యం

YSRCP minister Balineni Srinivas Reddy

అమరావతి: ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశమంతా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పథకాలను, ఆయన పనితీరును ప్రశంసించి అనుకరిస్తుంటే చంద్రబాబు మాత్రం రోజూ జగనే లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. చంద్రబాబు తీరు మారకపోతే రాజకీయంగా కనుమరుగుకావడం తథ్యమని జోస్యం చెప్పారు. ‘కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే చంద్రబాబు ఎక్కడో కూర్చుని ట్వీట్లు చేస్తూ పబ్బం గడుపుతున్నారు.

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ ఘటన అత్యంత దురదృష్టకరం. కొవిడ్‌ ఆసుపత్రి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి 10 మంది మృతి చెందడానికి కారణమైన రమేశ్‌ ఆసుపత్రి యాజమాన్యంపై చంద్రబాబు ఎందుకు స్పందించడంలేదు?’ అని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్‌ చేస్తున్న సంక్షేమ యజ్ఞాన్ని చూసి తమకి రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవనే భయంతో టీడీపీ నేతలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం సిగ్గు చేటని వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పురాణాల్లో రాక్షసులు యజ్ఞాన్ని అడ్డుకున్నట్లు ప్రభుత్వం చేసే మంచిని అడ్డుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/