జగన్ కులపిచ్చి పరాకాష్ఠకు చేరిందిః అనగాని సత్యప్రసాద్

జగన్ చెపుతున్న సామాజిక న్యాయం ఇదేనా? అని ప్రశ్న

anagani-satya-prasad-comments-on-jagan

అమరావతిః ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శలు గుప్పించారు. జగన్ కులపిచ్చి పరాకాష్ఠకు చేరిందని… కాపులు, బలిజ సామాజికవర్గాన్ని రాజకీయంగా అణచి వేస్తున్నారని మండిపడ్డారు. జగన్ కు రాష్ట్ర ప్రయోజనాల కంటే… ఆయన సామాజికవర్గమే ఎక్కువని విమర్శించారు. తాజాగా మూడు రాజ్యసభ సీట్లలో రెండింటిని రెడ్డి సామాజికవర్గానికే ఇచ్చారని దుయ్యబట్టారు. జగన్ చెపుతున్న సామాజిక న్యాయం ఇదేనా? అని ఎద్దేవా చేశారు. ఈరోజు అమరావతిలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాయలసీమలో ప్రధానమైన బలిజ సామాజికవర్గానికి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ కు రాజ్యసభ సీటును ఇస్తున్నట్టు తొలుత జగన్ ప్రకటించారని అనగాని తెలిపారు. ఆ తర్వాత ఆయనను తొలగించి సొంత సామాజికవర్గానికి చెందిన మేడా రఘునాథరెడ్డికి కేటాయించారని మండిపడ్డారు. ఇది బలిజల గొంతు కోయడం కాదా? అని ప్రశ్నించారు. నమ్మించి గొంతులు కోయడం జగన్ జీన్స్ లోనే ఉందని అన్నారు. బలహీనవర్గాలంటే జగన్ కు చిన్నచూపు అని దుయ్యబట్టారు.