మాగుంట రాఘవ బెయిల్ విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న వైస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ బెయిల్ పిటీషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగా కోర్టు తీహార్ జైలు సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం మాగుంట రాఘవ బెయిల్ విచారణను మార్చి 25 కు వాయిదా వేసింది. వాస్తవానికి ఢిల్లీ రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో మార్చి 23న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాఘవను తీహార్ జైలు అధికారులు హాజరుపరచాల్సి ఉంది. కానీ అధికారులు రాఘవను హాజరుపరచలేదు. దీంతో తీహార్ జైలు సూపరిండెంట్ పై స్పెషల్ కోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

శనివారం మరోసారి విచారణ జరుగనుందని అప్పుడు మాగుంట రాఘవను వర్చువల్ గా హాజరుపరచాలని తీహార్ జైలు సూపరింటెండెంట్‌ కు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాగుంట రాఘవను ఈడీ అధికారులు ఫిబ్రవరి 11 న ఆరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాఘవ తీహార్ జైలులో ఉన్నాడు. రాఘవ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. అటు ఇదే కేసులో మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సైతం ఈడీ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. బాలాజీ గ్రూప్ యజమానిగా ఉన్న మాగుంట రాఘవ ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేస్తుంటారు.గత 70 ఏళ్లుగా లిక్కర్ బిజినెస్ చేస్తున్న మాగుంట కుటుంబం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంది. దేశ వ్యాప్తంగా మాగుంట కుటుంబానికి పలు లిక్కర్ వ్యాపారాలు ఉన్నాయి.