నేను లొంగిపోవడం లేదు..అమృత్ పాల్ మరో వీడియో

amritpal-singh-released-another-video

న్యూఢిల్లీః పదమూడు రోజులుగా పరారీలో ఉన్న వారిస్ పంజాబ్ దే సంస్థ చీఫ్, ఖలిస్తానీ మద్దతుదారుడు అమృత్ పాల్ సింగ్ పోలీసులకు తాను లొంగిపోయే ప్రసక్తే లేదని, దేశం విడిచి కూడా పారిపోనని స్పష్టం చేశారు. వరుసగా రెండో రోజున గురువారం కూడా ఆయన యూట్యూబ్ లైవ్ లో మాట్లాడారు. తాను త్వరలోనే జనం మధ్యకు వస్తానని కూడా అమృత్ పాల్ ఈ వీడియోలో చెప్పారు.

సిక్కుల కోసం నిజాయతీగా పోరాటం చేస్తున్నట్లయితే.. సిక్కులకు మతపరంగా అత్యున్నత సంస్థ అయిన అకల్ తఖ్త్ చీఫ్ (జతేదార్) వెంటనే సిక్కుల అసెంబ్లీ (సర్బత్ ఖల్సా) నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. తాను రోజూ ఒక పూట మాత్రమే తింటూ.. 20, 22 కిలోమీటర్లు నడిచానని, రోజులు కష్టంగా వెళ్లదీస్తున్నానని అన్నారు. అయితే, తన మద్దతుదారులంతా మనోధైర్యంతో ముందుకు సాగాలని, తాను త్వరలోనే జనం మధ్యకు వస్తానన్నారు.