అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసిందిః అమిత్ షా

ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉన్న ఆధారాలను కమిటీకి ఇవ్వాలని సూచన

amit-shah-responds-on-adani-hindenburg-row

న్యూఢిల్లీః కేంద్ర హోం మంత్రి అమిత్ షా అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై స్పందించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసిందని, ఆధారాలు ఉన్న వారు ఎవరైనా వాటిని కమిటీకి సమర్పించాలని సూచించారు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ.. తప్పు ఎవరు చేసినా వదిలిపెట్టేది లేదని స్పష్టంచేశారు. న్యాయ వ్యవస్థ ప్రక్రియపై అందరికీ నమ్మకం ఉండాలని చెప్పారు. నిరాధార ఆరోపణలను చేయకూడదని, అవి ఎంతో కాలం నిలబడవని అన్నారు.

‘‘అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇద్దరు రిటైర్డ్ జడ్జిలతో కమిటీ వేసింది. ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉన్న ఆధారాలను కమిటీకి సమర్పించండి’’ అని చెప్పారు. అదానీ వ్యవహారంపై ఆరోపణలు చేస్తున్న వారికి పరోక్షంగా సూచనలు చేశారు. అదానీ వివాదంపై దర్యాప్తు జరుపుతున్నట్లు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ద్వారా సెబీ తెలిపిందని అమిత్ షా వివరించారు. ఈ దర్యాప్తును కొనసాగించాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు.

సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వంటి దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాయని అమిత్ షా చెప్పారు. రెండు మినహా మిగతా కేసులన్నీ యూపీఏ ప్రభుత్వ హయాంలో నమోదైనవేనని తెలిపారు. దర్యాప్తు సంస్థలు చేస్తున్న దానిపై కోర్టుల్లో సవాలు చేసుకోవచ్చని స్పష్టంచేశారు. ‘‘2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో ఓ పెద్ద మహిళా నేత.. ‘మేం అవినీతి చేసి ఉంటే.. ఎందుకు దర్యాప్తు చేయడం లేదు?’ అని ప్రశ్నించారు. ఇప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటే విమర్శిస్తున్నారు’’ అని ఆరోపించారు.

‘‘దర్యాప్తు సంస్థలు కోర్టులకు అతీతం కాదు. అవి ఇచ్చే నోటీసులు, నమోదు చేసే ఎఫ్ఐఆర్ లు, చార్జ్ షీట్ లను కోర్టుల్లో సవాలు చేసుకోవచ్చు. అభ్యంతరాలు ఉంటే కోర్టులను ఆశ్రయించాల్సింది పోయి.. బయట ఎందుకు అరుస్తున్నారు?’’ అని నిలదీశారు. ప్రతిపక్షాలకు తమ కన్నా మంచి లాయర్లు ఉన్నారని, దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేస్తున్నాయని వాళ్లు భావిస్తే కోర్టులకు వెళ్లొచ్చని స్పష్టం చేశారు. చట్టాన్ని అనుసరించాలని కోరారు.