ఐటీ మినిస్టర్ను బర్తరఫ్ చేయాలనే డిమాండ్ ఫై కేటీఆర్ ఫైర్

TSPSC పేపర్ లీక్ ఘటన ఫై మినిస్టర్ను బర్తరఫ్ చేయాలని బిజెపి నేతలు చేస్తున్న ఆరోపణల ఫై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలు ఐటీ డిపార్ట్మెంట్ పని ఏంటో తెలుసా..ఐటీ మినిస్టర్ ఏం చేస్తరో తెలుసా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రతీ కంప్యూటర్ కు తానే బాధ్యున్నా అని అడిగారు. ఐటీ డిపార్ట్ మెంట్ పై అవగాహన లేని వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.

TSPSC పేపర్ లీక్ ఘటన తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. విద్యార్థి సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నారు. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ నలుగురు మంత్రులు, ప్రభుత్వ సీఎస్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భాంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..గ్రూప్1 సహా రద్దయిన నాలుగు పరీక్షలకు ఫీజులు చెల్లించిన విద్యార్థులు తిరిగి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. నాలుగు పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ ఆన్ లైన్ లో ఉచితంగా అందుబాటులో పెడతామని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా స్టడీ సెంటర్లను బలోపేతం చేస్తామన్నారు. రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేసి అవి 24 గంటలు నడిచేలా చేస్తామన్నారు. స్టడీ సెంటర్లలో ఉచితంగా భోజనం కూడా అందించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజీ వెనక ఇద్దరు వ్యక్తులు ఉన్నారని.. వాళ్లిద్దరు చేసిన తప్పు అని.. ఇది వ్యవస్థ చేసిన తప్పు కాదని వివరించారు. ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. అనవసర వ్యాఖ్యానాల వల్ల విద్యార్థుల్లో అనుమానం కల్పించొద్దన్నారు. నాలుగు పరీక్షలను రద్దు చేయడం వల్ల ఈ పరీక్షలకు ఇప్పటికే క్వాలిఫై అయిన విద్యార్థులకు బాధ ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కానీ పెద్ద మనసుతో విద్యార్థులు ఆలోచించాలన్నారు. చాలా మంది విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాయాలా అని బాధపడుతున్నారని..కానీ అనుమానాలు వ్యక్తం అయిన తరుణంలో పరీక్షలు రాయకతప్పదన్నారు.