అమిత్‌ షాలో కంగారు మొదలైంది..అటూ ఇటూ పరుగులు తీస్తున్నారుః లాలూ ప్రసాద్

amit-shah-is-perturbed-the-same-is-going-to-happen-in-2024-says-lalu-prasad-yadav

న్యూఢిల్లీః బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కలిసి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని ఆదివారం ఆమె నివాసంలో కలువనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ చేరుకున్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మీడియాతో శనివారం మాట్లాడారు. శుక్రవారం బీహార్‌లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. అమిత్‌ షాలో కంగారు మొదలైందని అన్నారు. బీహార్‌లో మాదిరిగా కేంద్రంలోనూ జరుగుతుందని తెలిపారు. 2024లో అధికారాన్ని బిజెపి కోల్పోతుందని జోస్యం చెప్పారు. ‘అమిత్ షా కంగారు పడ్డారు. ఆయన ప్రభుత్వం బీహార్ నుంచి తుడిచిపెట్టుకుపోయింది. 2024లో కూడా అదే జరుగబోతోంది. అందుకే ఆయన (అమిత్‌ షా) అటూ ఇటూ పరుగులు తీస్తున్నారు. ‘జంగిల్‌ రాజ్‌’ అంటూ ఏదో చెబుతున్నారు. ‘గుజరాత్‌లో ఉన్నప్పుడు అమిత్‌ షా ఏం చేశారు? ఆయన ఉన్నప్పుడు జంగిల్ రాజ్ ఉండేది’ అని లాలూ విమర్శించారు.

కాగా, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, తాను కలిసి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని కలుస్తామని లాలూ ప్రసాద్‌ యాదవ్ తెలిపారు. ప్రతిపక్షాలను ఏకం చేయడానికి అన్ని ప్రయత్నాలు తాము చేస్తున్నామని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోడీని గద్దె దించుతామని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని పెకలిస్తామని వ్యాఖ్యానించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/