తెలంగాణ భవన్‌లో ఘనంగా అంబేద్కర్‌ జయంతి వేడుకలు

అంబేద్కర్‌ జయంతి సందర్బంగా తెలంగాణ భవన్ లో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్..ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతకు కేటీఆర్ ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..అంబేద్కర్‌ బోధించు, సమీకరించు, పోరాడు అనే స్పూర్తితోనే లక్షలాది మందిని సమీకరిస్తూ 14 ఏండ్లపాటు తెలంగాణ పోరాటాన్ని కేసీఆర్ నాయకత్వంలో కొనసాగించామని, ప్రజా పోరాటంతోనే రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశీర్వాదంతో, అంబేద్కర్ ఆశయాల ఆలోచనల మేరకు పదేండ్లు తమ ప్రభుత్వం పనిచేసిందని చెప్పారు.

ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల బాబాసాహెబ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనను గౌరవించుకున్నామని తెలిపారు. తాము ఏర్పాటు చేసింది విగ్రహం కాదు విప్లవం అని కేసీఆర్ ఆనాడే చెప్పారన్నారు. సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిన ఘనత కేసీఆర్‌కే సాధ్యమైందని తెలిపారు. అంబేద్కర్ కేవలం ఒక్క జాతికి సంబంధించిన వ్యక్తి కాదని, ఆయన అందరి మనిషని చెప్పారు. ఆరోజు మహాత్మ గాంధీతో పోల్చి చూడదగిన గొప్ప నాయకుడన్నారు. బడుగు బలహీన వర్గాలు, దళిత గిరిజన వర్గాల కోసం ఏ కార్యక్రమం చేసినా.. అవన్నీ అంబేద్కర్ ఆలోచన నుంచి వచ్చినవేనని పేర్కొన్నారు. వందకుపైగా దేశాల్లో అంబేద్కర్‌ను గుర్తుచేసుకుంటారని తెలిపారు.