బ్రో అట్టర్ ప్లాప్ అంటూ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్

పవన్ కళ్యాణ్ నటించిన బ్రో మూవీ అట్టర్ ప్లాప్ అయ్యిందని , ఈ సినిమా వల్ల నిర్మాతకు భారీ నష్టం వచ్చిందని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. సినిమాలో శ్యామ్ బాబు క్యారెక్టర్ ఫై ఇప్పటికే స్పందించిన రాంబాబు..మంగళవారం ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి బ్రో మూవీ ఫై , పవన్ కళ్యాణ్ ఫై పలు వ్యాఖ్యలు చేసారు.

బ్రో సినిమాతో తన శత్రువులను తిట్టాలని పవన్‌ అనుకున్నాడు. అందుకే ప్లాప్‌ అయ్యింది. కలెక్షన్లు రోజురోజుకి దారుణంగా పడిపోతున్నాయి. కనీసం పవన్‌కు ఇచ్చిన రెమ్యునరేషన్‌ కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే కాంట్రవర్సీ చేసి కాసులు రాల్చుకునేందుకు కక్కుర్తి పడుతున్నారు. కలెక్షన్లు పెంచుకునే క్రమంలో సినిమా అద్భుతమంటూ చెబుతున్నారు అంటూ సెటైర్లు వేశారు.

ఈ సినిమా వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని , బ్లాక్‌ మనీని వైట్‌గా మార్చే కుట్ర జరుగుతుందని అన్నారు. బ్రో చిత్ర నిర్మాత టీడీపీకి చెందిన వ్యక్తి . ఆయనొక ఎన్నారై. అమెరికా నుంచి పవన్‌కు వస్తున్న డబ్బు పెద్ద స్కాం. పవన్‌కు ఇవ్వాల్సిన ప్యాకేజీని చంద్రబాబు ముఠా ఇలా తన మనిషి విశ్వప్రసాద్‌ ద్వారా అందిస్తున్నది అంబటి కీలక వ్యాఖ్యలు చేసారు. తన సినిమాలకు బ్లాక్‌ మనీ వాడుతున్నారా? అంటూ పవన్‌ను నిలదీసిన అంబటి.. ఇప్పటివరకు ఎంత డబ్బు తీసుకున్నారు?.. బ్రో సినిమాకు ఎంత రెమ్యునరేషన్‌ తీసుకున్నారు? అని ప్రశ్నించారు.

అక్కడితో ఆగకుండా పవన్ క‌ళ్యాణ్‌ వ్యక్తిగత తీరుపై కథ రెడీ అవుతోందని.. ఈ సినిమాకు నిత్య పెళ్లికొడుకు, తాళి-ఎగతాళి, బహుభార్యా ప్రవీణుడు.. మూడు ముళ్లు-ఆరు పెళ్లిళ్లు టైటిల్స్‌ పరిశీలనలో ఉన్నాయని ఎద్దేవా చేశారు.