ప్రధాని మోడీ ర్యాలీకి అనుమతి నిరాకరించిన మేఘాలయ ప్రభుత్వం

మోడీ హవాను చూసి భయపడే ఇలా చేస్తున్నారని బిజెపి ఆరోపణ

Meghalaya govt denied permission for PM Modi’s rally in Tura: BJP

న్యూఢిల్లీః మేఘాలయలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ర్యాలీకి లో ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ నెల 24వతేదీన షిల్లాంగ్, తురాలో ప్రధాని మోడీఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో ఎన్పీపీ అధినేత, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా సొంత నియోజక వర్గమైన సౌత్ తురాలోని పీఏ సంగ్మా స్టేడియంలో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీని నిర్వహించేందుకు బిజెపిపీకి అనుమతి కోరింది. కానీ, మేఘాలయ క్రీడా విభాగం అనుమతి నిరాకరించింది. స్టేడియంలో ఇంకా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెబుతూ బిజెపి దరఖాస్తును తిరస్కరించింది. అయితే, రూ. 127 కోట్లతో నిర్మించిన ఈ స్టేడియాన్ని గతేడాది డిసెంబర్ 16న ముఖ్యమంత్రి కాన్రాడ్ ప్రారంభించారు.

స్టేడియం ప్రారంభోత్సవం జరిగిన రెండు నెలల తర్వాత ప్రధానమంత్రి ర్యాలీకి స్టేడియం అసంపూర్తిగా ఉందని, అందుబాటులో లేదని ఎలా చెబుతారని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు. కావాలనే ప్రధాని మోడీ ర్యాలీ, సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. మేఘాలయలో మోడీ హవా చూసి అక్కడి ప్రభుత్వం భయపడుతోందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రితురాజ్ సిన్హా అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర బిజెపి స్టార్ క్యాంపెయినర్ల ర్యాలీలకు ప్రజల స్పందన చూసి ఇతర పార్టీలు అవాక్కయ్యాయని సిన్హా ఆరోపించారు. కాగా, 60 స్థానాలతో కూడిన మేఘాలయ అసెంబ్లీకి ఈ నెల 27న ఎన్నికలు జరనగున్నాయి. మార్చి 2న కౌంటింగ్ నిర్వహించి ఫలితం వెల్లడిస్తారు.