ప్రధాని మోడీకి లేఖ రాసిన సీఎం జగన్

అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం జగన్ లేఖ రాశారు. కేంద్రానికి డిప్యూటేషన్ పై పంపించే ఐఏఎస్ అధికారుల ఎంపిక విషయంలో రాష్ట్రాలకే నిర్ణయాధికారం ఉండాలని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను స్వాగతిస్తూనే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని సవరణలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కేంద్రంలో కొరత లేకుండా పని చేసేందుకు రాష్ట్రాలకు చెందిన ఏఐఎస్‌ అధికారులను డిప్యుటేషన్‌పై పంపించాలనే సవరణను స్వాగతిస్తున్నానని, అయితే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండా డిప్యుటేషన్‌పై అధికారులను తీసుకోవాలనే సవరణ ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నో అబ్జెక్షన్‌ సర్టిపికెట్లను ఇచ్చి, అనుమతించిన అధికారులనే కేంద్ర డిప్యుటేషన్‌కు తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఈ విధానాన్ని కొనసాగించాలన్నారు.

సెంట్రల్‌ డిప్యుటేషన్లో భాగంగా తగిన సంఖ్యలో ఐఏఎస్‌ అధికారులను అందుబాటులో ఉంచేలా ఈ సవరణలను ప్రతిపాదించినట్లు కేంద్ర డీఓపీటీ శాఖ ఇటీవల రాష్ట్రాలకు తెలిపింది. తద్వారా కేంద్ర ప్రభుత్వంలో డిప్యుటేషన్‌పై వివిధ స్థాయిల్లో పని చేసే రాష్ట్ర క్యాడర్‌ ఐఏఎస్‌లు.. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సహాయం చేయగలుగుతారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రయోజనం పొందుతాయని నమ్ముతూ పూర్తి మద్దతు తెలుపుతున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖలకు నేతృత్వం వహించే రాష్ట్ర ఐఏఎస్‌ క్యాడర్‌ అధికారులు ఆయా రాష్ట్ర ప్రభుత్వ శాఖల కార్యక్రమాల నిర్వహణలో, వివిధ ప్రాజెక్టుల అమలులో ప్రభుత్వంలో కీలకంగా ఉంటారని తెలిపారు. క్లిష్టమైన ప్రాజెక్టులను, ఇతర అంశాలను నిర్వహించడానికి వారి నైపుణ్యం, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని వారికి బాధ్యతలు అప్పగిస్తుంటారని చెప్పారు. కేంద్రం డిప్యుటేషన్‌ కోసం అభ్యర్థించే ఐఏఎస్‌ అధికారుల నైపుణ్యం, అనుభవం అంచనా వేశాకే రాష్ట్రం నో అబ్జెక్షన్‌ పత్రం జారీ చేస్తుంది. అలాంటి వారిని డిప్యుటేషన్‌పై పంపడం వల్ల రాష్ట్రాలకు కొంత వెసులుబాటు కల్పించినట్లు అవుతుందన్నారు.

ఇది రాష్ట్ర ప్రయోజనాలను ప్రతికూలంగా ప్రభావితం చేయకుండా కేంద్ర డిప్యుటేషన్‌ రిజర్వు అవసరాలను సక్రమంగా తీర్చగలుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. అయితే కేంద్రం తాజాగా చేసిన సవరణ ప్రతిపాదన వల్ల ఇటువంటి సౌలభ్యం రాష్ట్రాలకు దూరమవుతుందన్నారు. ఒక అధికారిని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తక్షణమే రిలీవ్‌ చేయాల్సి వస్తుందన్నారు. రాష్ట్రంలో కీలకమైన శాఖలకు, ప్రాజెక్టులకు నేతృత్వం వహిస్తున్న ఇలాంటి అధికారులు అప్పటికప్పుడు కేంద్ర డిప్యుటేషన్‌కు వెళ్లడం వల్ల రాష్ట్రం చేపట్టే ముఖ్యమైన, కీలకమైన ప్రాజెక్టులు పట్టాలు తప్పుతాయన్నారు. అధికారుల వ్యక్తిగత జీవితాలను కూడా ప్రభావితం చేస్తుందని చెప్పారు. వారి కుటుంబాలు, పిల్లల విద్య వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఆ అధికారి సామర్థ్యం ఉత్తమంగా ఉన్నప్పటికీ సరైన రీతిలో సేవలను అందించలేకపోవచ్చు అని లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/