పోలీసుల వలయంలో అమలాపురం..పరిస్థితిని సమీక్షిస్తున్న డీఐజీ, నలుగురు ఎస్పీలు

రావులపాలెంలో ప్రత్యేక బలగాల మోహరింపు
సెక్షన్ 144, సెక్షన్ 30 అమల్లో ఉందన్న పోలీసులు

అమలాపురం : కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మార్చడాన్ని నిరసిస్తూ కోనసీమ జిల్లా సాధన సమితి నిన్నచేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన నేపథ్యంలో అమలాపురాన్ని పోలీసులు దిగ్బంధించారు. పట్టణాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారుల్లో నిఘాపెట్టి అమలాపురంలోకి ఎవరూ ప్రవేశకుండా చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బలగాలను రప్పించి మోహరించారు.

అమలాపురం వైపు వచ్చే అన్ని బస్సు సర్వీసులను రద్దు చేయడంతో రోడ్లు బోసిపోయాయి. బస్టాండ్లు నిర్మానుష్యమయ్యాయి. అలాగే, నిన్న నిలిపివేసిన సెల్‌ఫోన్ సిగ్నళ్లను ఇంకా పూర్తిస్థాయిలో పునరుద్ధరించకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకోవైపు, ఆందోళనకారులు పోలీసుల కళ్లుగప్పి పట్టణంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్న సమాచారంతో అన్ని మార్గాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

నిరసనకారులు నేడు రావులపాలెంలో ప్రదర్శనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రత్యేక బలగాలను అక్కడికి పంపారు. ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు, కాకినాడ ఎస్పీ రవీంద్రబాబు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, ఎన్టీఆర్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కుషాల్, గుంటూరు ఎస్పీ విశాల్ గున్ని అమలాపురంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కోనసీమ వ్యాప్తంగా సెక్షన్ 144, సెక్షన్ 30 అమల్లో ఉందని, ర్యాలీలు, నిరసనలు, బహిరంగ సభలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/