పవన్ కళ్యాణ్ ఆరోపణలను తప్పు పట్టిన అలీ

సినీ నటుడు , వైస్సార్సీపీ నేత , ఏపీ ఎల‌క్ట్రానిక్ మీడియా స‌ల‌హాదారుడు అలీ..పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఫై చేస్తున్న ఆరోపణలను తప్పుపట్టారు. అలీని ప్రభుత్వం ఎల‌క్ట్రానిక్ మీడియా స‌ల‌హాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం అలీ తన బాధ్యతలను స్వీకరించారు. అధికారులు వెంట రాగా తన చాంబర్ లో ప్రవేశించారు. ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ చేతుల మీదుగా బాధ్యతలు అందుకున్నారు.

ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. తనను ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించడం పట్ల సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై సీఎం జగన్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇళ్లను కూల్చేస్తోందని.. జనసేన పార్టీ ప్లీనరీ కోసం గ్రామ ప్రజలు స్థలం ఇవ్వడంతో ప్రభుత్వం కక్షగట్టి ఇళ్లను కూలుస్తోందని.. ఈ దౌర్జన్యాన్ని చూస్తూ ఊరుకోమని పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను అలీ తప్పుబట్టారు.

‘‘నాకు తెలిసి ఆ ఆరోపణలు కరెక్ట్ కాదు. ప్రజల ఆదరణ పొందిన పార్టీ వైఎస్సార్‌సీపీ. ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. ప్రజలు ఊరకనే తీసుకొచ్చి చేతిలో పెట్టేయలేదు. మీ పాలన బాగుంటుంది.. అద్భుతమవుతుంది, స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది అని నమ్మారు. విశాఖపట్నం కావచ్చు.. రాయలసీమ కావచ్చు అన్ని చోట్లా అభివృద్ధి జరుగుతోంది. మొన్న ఉత్తరాంధ్ర షూటింగ్‌కు వెళ్లాం.. ఆ బీచ్‌లు కానీ, రోడ్లు కానీ అద్భుతంగా ఉన్నాయి. అప్పట్లో డవలెప్‌మెంట్ లేని రోజుల్లో కూడా షూటింగ్‌లు జరిగాయి. ఇప్పుడు డవలెప్ చేస్తే తెలుగు సినిమాలే కాదు.. తమిళం, హిందీ, మలయాళం, కన్నడ ఫిలింస్ మన దగ్గరికి వస్తాయి. మనం వెళ్లి అక్కడ చేసుకుంటున్నాం.. వాళ్లొచ్చి ఇక్కడ చేసుకుంటే మనకు ఉపాధి దొరుకుతుంది’’ అని అలీ చెప్పుకొచ్చారు.

ఇప్పటం గ్రామంలో నిబంధలకు అనుగుణంగా ప్రభుత్వం ఇళ్లను కూలుస్తోందని.. దానికి పరిహారం కూడా చెల్లిస్తోందని అలీ గుర్తుచేశారు. ఇరుకులో బతుకుతోన్న ప్రజలకు వసతి కల్పించడానికి, రాబోయే తరానికి ఎలాంటి కష్టం కలగకుండా ఇప్పటం గ్రామంలో రోడ్డును ప్రభుత్వం విస్తరిస్తోందని అలీ అన్నారు.