అగ్నిపథ్ కు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ మద్దతు

కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ ను దేశ వ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నారు. ఆర్మీ విద్యార్థులతో పాటు , రాజకీయ పార్టీలు సైతం ఈ పధకాన్ని రద్దు చేయాలంటూ నిరసనలు చేస్తుంటే..కేంద్రం మాత్రం ఆగ్నిపధ్ విషయంలో తగ్గిదేలే అంటుంది. తాజాగా అగ్నిపథ్ కు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మాత్రమే సైన్యంలో సంస్కరణలు సాధ్యమయ్యాయని..అగ్నిపథ్​ను రద్దు చేసే ఆలోచనే లేదన్నారు.

దేశాన్ని అత్యంత సురక్షితంగా, పటిష్టంగా ఉంచేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మోదీ ప్రదర్శిస్తున్న రాజకీయ ధైర్యం ప్రశంసనీయమని కొనియాడారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో డోవల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అగ్నివీర్‌లను స్వలకాలిక వ్యవధిపై ఉద్యోగాల్లో తీసుకోవడంపై వ్యక్తమవుతున్న ఆందోళనలను అజిత్ డోవల్ తోసిపుచ్చారు. నాలుగేళ్లలో నేర్చుకున్న నైపుణ్యాలు, క్రమశిక్షణ కారణంగా అగ్నివీరుల భవిష్యత్తు నాలుగేళ్ల తర్వాత కూడా సురక్షితంగా ఉంటుందన్నారు. దేశ భద్రత కన్నా మరేది ముఖ్యం కాదని ప్రధాని చెప్తుంటారని గుర్తుచేశారు. 2019 తర్వాత కశ్మీర్​ ప్రజల ఆలోచన విధానం మారిపోయిందని.. ఇప్పుడిక ఎవరూ తీవ్రవాదం, పాకిస్థాన్​కు మద్దతు తెలపట్లేదని పేర్కొన్నారు. యువత దేశంపైన, ప్రభుత్వంపైన నమ్మకం ఉంచాలని విజ్ఞప్తి చేశారు.

సైన్యంలో సంస్కరణలు అవసరం. ఆధునిక ఆయుధాలు అందిస్తే సరిపోదు. సాంకేతికత, వ్యవస్థ, బలగాలు, విధానాలు మొదలైన విషయాల్లో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సంస్కరణలు చేపట్టాలి. ప్రస్తుతం యుద్ధ విధానమే మారిపోతోంది. కనిపించని శత్రువుతో పోరాడాల్సి వస్తోంది. టెక్నాలజీ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. రేపటికి సిద్ధంగా ఉండాలి అంటే ఈరోజు మనం మారాల్సిందే. దేశంలోని యువతకు ఏదో విధంగా సేవ చేయాలని ఉంటుంది. దేశాన్ని దృఢంగా తయారుచేసే క్రమంలో వారి శక్తి, నైపుణ్యాలు కీలక పాత్ర పోషిస్తాయి” అని అజిత్ డోవల్ తెలిపారు.