బిజెపి రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు..?

దేశంలోనే అత్యున్నత పదవి అయిన భారత రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు రాష్ట్రపతి ఎన్నికలపైనే ఫోకస్ చేసాయి. కాగా విపక్ష పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హాను ఖరారు చేయబోతుండగా..NDA అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి పేరును ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఎన్నిక తేదీ సమీపిస్తుండటంతో భారతీయ జనతాపార్టీ పెద్దలు అభ్యర్థి ఎంపికపై కసరత్తులు ముమ్మరం చేశారు. ఇదే విషయానికి సంబంధించి పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెంకయ్యనాయుడితో ఈ రోజు మధ్యాహ్నం భేటీ అయ్యారు. వీరిమధ్య దాదాపు గంటసేపు సమావేశం జరిగింది.

ఈ ఎన్నికల కోసం పలువురు కేంద్ర మంత్రులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు సహా 14 మంది నేతలతో భాజపా ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీతో జేపీ నడ్డా ఆదివారం భేటీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పలువురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే భాజపా సీనియర్లు.. ఆయనను కలిసినట్లు తెలుస్తోంది. దాదాపు.. కొత్త రాష్ట్రపతి ఎన్నిక లాంఛనమే అయ్యే అవకాశం ఉంది. అధికార పార్టీకి ఎలక్ట్రోరల్​ కాలేజీలో 48 శాతానికిపైగా మద్దతు ఉంది. దీంతో దాదాపు అభ్యర్థే విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

మరోవైపు చత్తీస్ ఘడ్ గవర్నర్ అనసూయియా ఉయికీ కూడా రాష్ట్రపతి పదవికి ఎన్డీయే తరఫున రేసులో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే, వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతిగా కొనసాగించే అవకాశాలున్నాయి. లేదంటే వెంకయ్యను రాష్ట్రపతిగా ప్రకటిస్తే అనసూయియా ఉయిని ఉప రాష్ట్రపతిని చేసే అవకాశం కనపడుతోంది. ఈరోజు సాయంత్రానికి ఈ విషయమై ఒక స్పష్టత రానుంది.