ఆమంచిని వదలని సీబీఐ

ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌ను సిబిఐ వదలడం లేదు. మరోసారి సిబిఐ ఆయనకు నోటీసులు జారీచేసింది. న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆమంచిని విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా, గతంలోనూ ఇదే కేసు విషయంలో సీబీఐ విచారణకు హాజరు అయ్యారు.

ఏపీ హైకోర్టు జడ్డీలు, వారి తీర్పులపై గతంలో బహిరంగంగానే వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రకాశం జిల్లా చీరాల వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన విశాఖలో సీబీఐ విచారణకు హాజరై తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారుయ అయితే ఆయనకు సీబీఐ మరోసారి ఇవాళ నోటీసులు జారీ చేసింది. సెక్షన్ 41ఏ కింద మరోసారి విచారణకు రావాలని ఆయనకు నోటీసులు ఇచ్చింది. అయితే గతంలోనే సెక్షన్ 41ఏ నోటీసులు జారీ చేసిన సీబీఐ విచారణ జరిపింది. అయితే మరోసారి అదే నోటీసు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. విజయవాడలోని సీబీఐ కార్యాలయానికి బుధవారం ఉదయం 10:30 గంటలకు రావాలని నోటీసులో వెల్లడించారు. దీంతో ఆయన మరోసారి విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు.