ఎన్నికల కోడ్ పేరుతో లోకేష్ పాదయాత్రను అడ్డుకునే యత్నం: వర్ల రామయ్య

పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని సీఈసీని కోరిన వర్ల రామయ్య

varla ramaiah
varla ramaiah

అమరావతిః ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి పేరుతో నారా లోకేశ్ పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారని టిడిపి సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఎలెక్షన్ కోడ్ అంటూ టిడిపి బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగిస్తున్నారని విమర్శించారు. స్థానిక టిడిపి నేతలు చేస్తున్న ఏర్పాట్లపై నిరంకుశంగా వ్యవహరిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీలు, పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరుగుతాయని చెప్పారు. పాదయాత్రలో ప్రదర్శిస్తున్న టిడిపి జెండాలు, ఫ్లెక్సీలకు ఎన్నికల నియమావళి వర్తించదని అన్నారు. పాదయాత్రకు సంబంధించి టిడిపి జెండాలు, బ్యానర్లను తొలగిస్తూ అడ్డంకులు సృష్టించకుండా రాష్ట్ర పోలీసులను ఆదేశించాలని సీఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.