ఉసురు తీస్తున్న ఊపిరి

పర్యావరణం పట్ల ప్రజల్లో అవగాహన అవసరం

Air pollution must be controlled
Air pollution must be controlled

కాలుష్య నివారణకై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరణ యోగ్యంకాని విధా నాలు, ప్రయోగాలు చేస్తూ రోజురోజుకు సమస్యను జటిలం చేస్తున్నారు.ఫలితంగా పర్యావరణం విషతుల్యంగా మారుతున్నది.

దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు అనేక వ్యాధులకు గురవ్ఞతున్నారు. మరెం దరో దీర్ఘకాలిక వ్యాధులబారినపడి మంచానికే పరిమి తమై కృంగికృశించి అసువ్ఞలు బాస్తున్నారు. కాలుష్య మేఘాలు అంతకంతకు కమ్ముకోవడం ఆందోళన కలిగించే అంశం. ప్రధానంగా దేశంలోని అనేక నగరాల్లో పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతున్నది.

ఒక్క వాయు కాలుష్యమేకాదు నీటి కాలుష్యం కూడా పరిస్థితిని పతా నంచునకు తీసుకుపోతున్నది. రోజురోజుకు గ్రామాల నుండి నగరాలకు వలస వచ్చేవారు ఎక్కువ కావడంతో పాటు సమస్య మరింతజటిలంగా మారుతున్నది. మురికి వాడల నిర్మూలనకు దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయలు వెచ్చించి ఎంత ప్రయత్నం చేస్తున్నా ఎక్కడికక్కడ ఎప్పటి కప్పుడు కొత్తవి పుట్టుకొస్తున్నాయి.

ప్రధానంగా పీల్చేగాలిలో ప్రమాదకరమైన దుమ్ముకణాలు పెచ్చరిల్లుతుండటంతో ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారుతున్నది. భారతదేశానికి సంబంధించినంతవరకు దేశంలోని ఆరు మెట్రోనగరాలు ఢిల్లీ,కోల్‌కతా,చెన్నై,ముంబాయి,బెంగళూరు, హైదరాబాద్‌ లో జరిపిన సర్వేల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.

ముఖ్యంగా ఢిల్లీ పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది.ఢిల్లీ పరిసరప్రాంతాల్లో ఉన్నకొందరు రైతులు తమ పంటవ్యర్థాలను దగ్ధం చేయడం పెనుశాపంగా పరి ణమిస్తున్నది. దీనిని అడ్డుకునేందుకు పాలకులు నిషేధం విధించి, భారీగా జరిమానాలతోపాటు జైలు శిక్ష కూడా విధించాలని నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఏమాత్రం తగ్గకపోగా ప్రస్తుతం రైతులు చేస్తున్న ఆందోళనలో దీనిని తొలగించాలనే డిమాండ్‌ కూడా ఒకటిగా మా రింది. అనేక నగరాల్లో నీటి,గాలి నాణ్యత వాతావరణంలో మార్పులు, అటవీ విస్తీర్ణం, చెత్తనిర్వహణ తదితర అంశాలపై జరిపిన అధ్యయనంలో వాయుకాలుష్యం నగరజీవి ఊపిరితిత్తులకు తూట్లుపొడుస్తుందనే విషయం బయటపడింది.

హైదరాబాద్‌ నగరంలో నీటి,వాయుకాలుష్యంతోపాటు నిర్మాణ రంగంవల్ల పీల్చే గాలిలో ధూళికణాలు అధికంగా ఉన్నట్లు వెలుగుచూసింది.హైదరాబాద్‌నగర శివారుల్లో పరిశ్రమలు గాలిలో వదులుతున్న కాలుష్యానికి అడ్డూఅదుపులేకుండా పోతున్నది.

అలాగే నీటి కాలుష్యం దేశవ్యాప్తంగా కూడా ఆందోళనకరంగా తయారవుతున్నది. దేశంలో సగానికి పైగా చెరువ్ఞలు, జలాశయాల్లో ఉన్న నీరు తాగడానికి పనికిరాకుండాపోయాయి. ఒకనాడు తాగునీరు అందించిన కొన్ని నీటివనరులు ఇప్పుడు పూర్తిస్థాయిలో కాలుష్యకారకంగా మారి వెదజల్లుతున్న దుర్వాసనలు చుట్టుపక్కల ప్రాంతాల వారికి తీవ్రంగా ఇబ్బంది కలిగిస్తున్నాయి.

నగరాల రోడ్లపై నడుస్తున్న వాహనాలు వెదజల్లుతున్న కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాహన కాలుష్యాన్ని నివారించేందుకు అధికారులు చేస్తున్న ప్రయ త్నాలు అంతగా సఫలీకృతం కావడం లేదు.

1989 నాటి మోటారు వాహనాల చట్టం రూల్‌నెం.5 ప్రకారంనిర్ధారిత ప్రమాణాలకు మించి పొగవదిలితే జరిమానా విధించాలి. అప్పటికీ అదుపుకాకపోతే ఏకంగా వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలి. పర్యావరణాన్ని కాలుష్యం చేస్తూ మోతాదు కుమించి పొగలు వదులుతున్న ఏ వాహనం అయినా ఈ చట్టపరిధిలోకి వస్తుంది.

ఈ చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తూ ప్రస్తుతం తెలుగురాష్ట్రాల వరకు పరిశీలించినా సగానికిపైగా వాహనాలు రోడ్లపై తిరిగే అవకాశం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 1993లో మొదటి సారిగా వాహనకాలుష్య నియంత్రణ కోసం కాలుష్య నియంత్రణ మండలిని (పిసిబి)ని ఏర్పాటు చేశారు. అప్పటి నుండి అధికారుల మీద అధికారులను నియ మిస్తూ నిబంధనలను రూపొందిస్తూనే ఉన్నారు.

మార్పులు చేర్పులు చేస్తూ నిబంధనలను అతిక్రమించిన వారిపై జరిమానాతో పాటు జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించారు. అయినా ఎలాంటి ఫలితాలు రాలేదు.ఎన్ని చట్టాలు తెచ్చినాఅవన్నీ దాదాపు కాగితాలకే పరిమితమవ్ఞతు న్నాయి. ప్రయోగాలు విఫలమవుతున్నాయే తప్ప ఫలితాలు రావడం లేదు.

ఫలితంగా వాతావరణం కార్బన్‌ మోనాక్సైడ్‌, నైట్రిక్‌ ఆక్సైడ్‌, దుమ్ముధూళి పెరిగిపోతున్నది. వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ పర్యావరణం అంతగా కలుషితమైపోతున్నది. పెట్రోలులో జరుగుతున్న కల్తీ సమస్యను మరింతగా పెంచుతుందనే చెప్పొచ్చు.గతంలో పర్యావరణ శాస్త్రజ్ఞులు చేసిన అధ్యయనంలో భారత్‌ దాదాపు వంద దేశాల కంటే అట్టడుగున ఉన్నట్లు బయటపడింది.

అంతేకాదు భారత్‌ వాతావరణంలో ధూళికణాలు ఉండాల్సిన స్థాయి కన్నా ఐదు రెట్లు అధికంగా ఉండి శ్వాసకోశ సమస్యల నుంచి కేన్సర్‌ దాకా అనేక వ్యాధులకు కారణమవ్ఞతున్నా యనే విషయం బయటపడింది. ప్రత్యేకించి భావితరం బాలబాలికల బతుకుదీపాలను కాలుష్యం ఛిదిమేస్తుంద నేది ఆందోళన కలిగించే అంశం.

ఐదేళ్లలోపు బాలబాలికల్లో దాదాపు పదిహేను శాతం శ్వాస సంబంధిత వ్యాధులతో చికిత్సపొందుతూ ఆస్పత్రుల్లోనే కన్నుమూస్తున్నారు. వాయుకాలుష్యం నుంచి మంచి కొలెస్ట్రాల్‌ చెడు కొల ెస్ట్రాల్‌గా మారడం గుండెజబ్బులకు, పక్షవాతానికి, ఊపిరి తిత్తుల కేన్సర్‌కుమూలం అవుతుందని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ కాలుష్య తీవ్రతను పాలకులు ఇప్పటి కైనా గుర్తించి నివారణకు ఆచరణ యోగ్యమైన విధానాలను ప్రకటించి త్రికరణశుద్ధిగా అమలుకు ప్రయత్నం చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా పర్యావరణం పట్ల సాధారణ ప్రజల్లో అవగాహన పెంచేందుకు పెద్దఎత్తున కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

దామెర్ల సాయిబాబ , ఎడిటర్ , హైదరాబాద్

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/