విద్యాసంస్కరణలు బతుకు బాట వేసేనా?

జాతీయ విద్యావిధానానికి గ్రీన్‌ సిగ్నల్‌ – దేశంలో సరికొత్త విధానం అమలులోకి..

national education system
national education system

జాతి పురోభివృద్ధికి విద్య,ఆరోగ్యం ఎంతో కీలకమైన పాత్ర వహిస్తాయనే మాటకు మరో అభిప్రాయానికి తావులేదు.

ఈ రెండూ ప్రధానవిషయాల్లో భారత్‌ ఎంతో వెనుక బడిపోయిందనే వాదనను కూడా తోసిపుచ్చలేం.

ప్రజా రోగ్య విషయంలో ఎంతటి దీనావస్థ పరిస్థితుల్లో ఉన్నా మో కరోనా పోరులో బయటపడుతూనే ఉంది. చికిత్స సంగతి దేవుడెరుగు.

ప్రాణవాయువు అందక ఎందరో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారంటే సమర్థత చెప్పకనే చెబుతున్నది. అలాని ఏమీ చేయలేదని చెప్పడం లేదు. వైద్యరంగం విషయంలో ఎంతో కృషి చేశారు.

లక్షలాది ఆస్పత్రులను నిర్మించారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చేయడమేకాక చికిత్స విధానంలో విప్లవాత్మక మైన మార్పులు తీసుకువచ్చారు.

అయినా ప్రజా అవస రాలకు తగినట్లుగా వైద్యరంగస్థాయిని, వనరులను సమ కూర్చులేకపోయాం.

ఇక విద్య విషయంలో కూడాఇందుకు భిన్నంగా లేదు పరిస్థితి.

ఏడు దశాబ్దాల స్వాతంత్య్ర అనంతరం, లక్షలాది కోట్ల రూపాయలు విద్యారంగానికి వెచ్చించిన తర్వాత కూడా ఇప్పటికీ వంద శాతం అక్షరా స్యత సాధించలేకపోయాం.

మరో దశాబ్దకాలం నాటికి లక్ష్యాన్ని సాధించగలమని పాలకపెద్దలు చెప్తున్నారు. అయితే విద్యావిధానంలో ఎన్నో మార్పులు చేర్పులు ఇప్పటికే చోటు చేసుకున్నాయి.

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నూతన జాతీయ విద్యావిధానానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది.

భారత దేశానికి సంబంధించి దాదాపు ముప్ఫైనాలుగుఏళ్లతర్వాత విద్యారంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు.

డాక్టర్‌ కస్తూరిరంగన్‌ కమిటీ రూపొందించిన జాతీయ విద్యావిధానానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో దేశంలో సరికొత్త విధానం అమలులోకి రాబోతున్నది.

ప్రాథమిక, ఉన్నత విద్యాపరంగా అనేక కోణాల్లో చర్చించిన తర్వాత 27 అంశాల్లో మార్పులు, చేర్పులు చేయనున్నట్లు ప్రతి పాదించారు.

విద్యార్థులు తమకు ఇష్టమైన కోర్సులను చదువ్ఞకునే వెసులుబాటు కల్పిస్తూ విద్యావిధానంలో సరళమైన మార్పులకు కూడా శ్రీకారం చుట్టారు.

ఇక ఐదో తరగతి వరకు ప్రాథమిక విద్యను మాతృభాషలోనే కొనసాగించాలని నిర్దేశించారు.

అంతేకాదు ఎనిమిదో తరగతి వరకు కానీ, అంతకు మించిన తరగతుల వరకు కానీ మాతృభాషలోనే విద్యాబోధన చేయడం ఉత్తమ మని, ఈ సరికొత్త విద్యావిధానంలో రాష్ట్రాలకు నిర్దేశించారు.

మానవ వనరుల అభివృద్ధిశాఖ పేరును విద్యాశాఖ గా మార్చడానికి కూడా ఆమోదం తెలిపారు. జాతీయ విద్యావిధానాన్ని స్వాతంత్య్రం వచ్చిన అనంతరం 1968 లో రూపొందించారు.

ఆ తర్వాత మారిన పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా 1986లో మళ్లీ ఒకసారి రూపకల్పన చేశారు.

దానికి 1992లో కొన్ని సవరణలు చేశారు. వాస్తవంగా పరిశీలిస్తే 1986లో రూపొందించిన విధానమే ఇప్పటివరకు కొనసాగుతూవచ్చింది.

దానిస్థానం లో కొత్త విధానం రూపొందించడానికి కేంద్రప్రభుత్వం 2016మే27న టిఎస్‌ఆర్‌ సుబ్రహ్మణ్యం కమిటీ 2019లో మే 31న కస్తూరిరంగన్‌ కమిటీ దీనిని ఏర్పాటు చేసింది.

కస్తూరిరంగన్‌ కమిటీ విద్యారంగ నిపుణులతో చర్చించి సమగ్ర అధ్యయనం అనంతరం అన్ని కోణాల్లో ఆలోచించి నివేదిక సమర్పించింది.

పాఠశాలనుంచి ప్రారంభిస్తే ఉన్నత విద్యవరకు ప్రతిదశలోనూ సంస్కృతం ఒక ఆప్షన్‌ సబ్జెక్టు గా అందుబాటులో ఉంచారు. మిగిలిన భాషను కూడా తీసుకోవచ్చు.

ఏ భాషను విద్యార్థిపై బలవంతంగా రుద్దే అవకాశాలు లేకుండా చేశారు. ఇక పరీక్షల విధానంలో కూడా సమగ్రమైన మార్పులు,చేర్పులకు శ్రీకారంచుట్టారు.

పాఠశాలస్థాయిలో మూడు, ఐదు, ఎనిమిది తరగతుల్లోనే స్కూలు పరీక్షలు ఉంటాయి.

ఇవికూడా బోర్డు స్థాయిలోనే నిర్వహిస్తారు. పది, పన్నెండు తరగతులకు ప్రస్తుతం ఉన్నట్లే పరీక్షలు కొనసాగుతాయి.

కానీ పరీక్షల విధానంలో మార్పులు చేశారు.విద్యార్థుల జ్ఞాపక శక్తిని మాత్రమే కాకుండా వారి జ్ఞానాన్ని విశ్లేషణలను, ఇతరత్రా నైపుణ్యా లను పరీక్షించే విధంగా ఈ పరీక్షలు ఉండబోతాయి.

ఆరోతరగతి నుంచే వృత్తివిద్యలను అందుబాటులోకి తీసుకువస్తారు.

ఆవిద్యార్థి పన్నెండో తరగతి వచ్చేసరికి ఏదో ఒక వృత్తి విద్యలో ప్రవేశంతోపాటు ప్రావీణ్యతను కూడా సంపాదిస్తాడు.

ఇప్పటి దాకా వృత్తివిద్యాకోర్సులు ప్రత్యేకంగా ఉండేవి. సాంకేతిక విద్య, వ్యవసాయవిద్య, వైద్యం,ఇలా ప్రొఫెషనల్‌ కోర్సులు విడివిడిగానే కొనసా గుతున్నాయి.

వీటన్నింటిని ఉన్నత విద్యలో కలిపి మల్టీ డిసిప్లినరీ వెసులుబాటు కల్పించబోతున్నారు. బోధనా రంగంపై కూడా కొంత దృష్టిపెట్టారు.

ఉపాధ్యాయుల సామర్థ్యాలపై కూడా అంచనా వేస్తారు. ఉపాధ్యాయుల నియామకాల్లో కూడా పారదర్శకతతోపాటు నిర్దిష్టమైన పద్ధతిలో చేపడతారు.

వారివారి సామర్థ్యాలను మదించిన తర్వాతే వారికి పదోన్నతలు ఉంటాయి. ఇందుకోసం జాతీయస్థాయిలో ప్రమాణాలు రూపొందిస్తారు.

మొత్తం మీద జాతీయ నూతన విద్యావిధానంలో ఎన్నో సమగ్ర మైన మార్పులకు చోటుకల్పించారు.

ఈ నూతనవిద్యావిధా నంలో లక్ష్యాలు, ఆశయాలు, ఉద్దేశ్యాలు అన్నీ బాగానే ఉన్నా ఏ మేరకు అమలు చేయగలుగుతారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

అన్నింటికంటే ముఖ్యంగా ప్రస్తుతం విద్యారంగానికి అటు కేంద్రం కానీ,ఇటు రాష్ట్రం కానీ ఏటా ఇస్తున్న నిధులు ఏమాత్రం సరిపోవని, మరింత భారీగా పెంచితే కానీ లక్ష్యాలవైపు అడుగులువేయలేమని విద్యారంగ నిపుణులే అభిప్రాయపడుతున్నారు.

ఏ మార్పులు, సంస్కరణలు చేపట్టినా ఉన్న విధానాల్లో లోటుపాట్లను సరిచేసుకుంటూ మరింత పురోగాభి వృద్ధివైపు నడిపించే విధంగా ఉండాలి.

బతుకుకు ఉపయోగపడే విద్యకావాలి. అందుకు అన్నింటికంటే ముఖ్యంగా అమలులో త్రికరణశుద్ధి ఎంతో అవసరం.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/