పంద్రాగస్టు నేపథ్యంలో ఐబీ హెచ్చరికలు..అప్రమత్తమైన పోలీస్ శాఖ

పంద్రాగస్టు నేపథ్యంలో లష్కరే తాయిబా, జైషే మహమ్మద్‌ వంటి ఉగ్రమూకలు విధ్వంసాలకు పాల్పడే ప్రమాదముందంటూ కేంద్ర నిఘా సంస్థ(ఐబీ) హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అన్ని రాష్ట్రాల పోలీసు శాఖలు అప్రమత్తం అయ్యాయి. ఆగస్ట్‌ 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశ రాజధాని ఢిల్లీ లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అంతేకాదు.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ దాడులు, అల్లర్లకు పాల్పడే అవకాశాలున్నాయని హెచ్చరికలు వెలువడిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తం అయ్యారు.

హైదరాబాద్ లోని పర్యాటక ప్రాంతాలు, వీవీఐపీలు ఉండే ప్రదేశాల్లో హై అలర్ట్ ప్రకటించింది పోలీస్ శాఖ. శంషాబాద్ విమానాశ్రయం, రైల్వేస్టేషన్లు, బస్టేషన్లు, రద్దీ ప్రదేశాల్లో నిఘాను ముమ్మరం చేశారు. అటు శంషాబాద్ విమానాశ్రయంలో ఈ నెల 30 వరకు హైఅలెర్ట్ కొనసాగిస్తామని అధికారవర్గాలు వెల్లడించాయి.

ఇక దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు నిర్వహించే స్వాతంత్య్ర భారత వజ్రోత్సవం వేడుకల్లో హైదరాబాద్ నగర ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని జీహెచ్ఎంసీ పిలుపునిచ్చింది. వజ్రోత్సవాల సందర్భంగా ఆగస్టు 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు రోజుకొకటి ప్రత్యేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 15 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.