భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Second warning level in on force at Bhadrachalam

భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండం.. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో బుధవారం ఉదయం 5 గంటలకు 49.3 అడుగులుగా ఉన్న నీటిమట్టం 7 గంటల సమయానికి 49.8 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నదిలో 12,11,032 క్యూసెక్కుల వరద ప్రవహిస్తున్నది. నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు.

మరోసారి గోదావరికి వరద పోటెత్తడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, సారపాక, అశ్వారావుపేట, పినపాక, ఏడూళ్లబయ్యారం తదితర గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్‌ అనుదీప్‌ కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రజలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గత నెలలో గోదావరి రికార్డు స్థాయి లో 70 అడుగుల మేర ప్రవహించింది. దీంతో ముంపు గ్రామాలే కాక భద్రాచలం పట్టణంలోని పలు కాలనీ లు నీటమునిగాయి. దాదాపు వారం రోజుల పాటు గ్రామాల ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలలో ఉండిపోయారు. ఇప్పుడు మరోసారి గోదావరి నీటిమట్టం పెరుగుతుండడం తో వారంతా భయపడుతున్నారు.