ఆఫ్ఘనిస్థాన్ లో మసీదుపై ఆత్మాహుతి దాడి

ప్రార్థనలు చేస్తున్న షియా ముస్లింలే లక్ష్యంగా దాడి

కాబూల్ : అఫ్గానిస్థాన్‌ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కుందుజ్‌ ప్రావిన్స్‌లో రక్తం ఏరులైంది. షియా తెగ ముస్లింలే లక్ష్యంగా కుందుజ్‌ పట్టణంలోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో సూసైడ్‌ బాంబర్‌ తనను తాను పేల్చేసుకొన్నాడు. ఈ శక్తిమంతమైన పేలుడులో 46 మంది చనిపోయారు. అనేక మందికి గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మృతదేహాలు, రక్తంతో మసీదంతా భీతావహంగా ఉందని, మసీదు మెట్లపై నుంచి రక్తం నీళ్లలాగా పారుతుండగా చూశానని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. షియా ముస్లింలే లక్ష్యంగా మసీదులో బాంబు పేలుళ్లు జరిగాయని తాలిబన్‌ సీనియర్‌ నేత జబియుల్లా ముజాహిద్‌ చెప్పారు. తాలిబన్‌ ప్రత్యేక దళాలు కుందుజ్‌ చేరుకొన్నాయని, దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు. షియాల భద్రతకు తాలిబన్‌ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటున్నదని చెప్పారు. మసీదులో ఆత్మాహుతి దాడి తమ పనేనని ఐసిస్‌ ప్రకటించింది. దాడికి పాల్పడింది వీగర్‌ ముస్లిం అని ఐసిస్‌ ప్రకటనను బట్టి తెలుస్తున్నది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/