ఒమిక్రాన్ ఎఫెక్ట్..అన్ని దేశాలు అలర్ట్

కరోనా మహమ్మారి ఉదృతి తగ్గిందని అనుకునే లోపే మరో కొత్త వేరియంట్ బయటకొచ్చింది. ఒమిక్రాన్ అనే వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. దక్షిణాఫ్రికా సహా పలు ఆఫ్రికా దేశాల నుంచి విదేశీయులు రావొద్దని బ్రిటన్‌తో పాటు, అమెరికా, రష్యా, జపాన్, ఆస్ట్రేలియాలు కూడా ప్రకటించాయి. విమాన సర్వీసుల్ని ఆపేస్తుండడం వల్ల అనేక ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు చిక్కుకుపోతున్నారు. బ్రిటన్‌లో తొలిసారిగా శనివారం రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. జర్మనీలోనూ ఒకరు ఒమిక్రాన్ బారిన పడినట్టు అనుమానిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన బి.1.1.529 వేరియంట్ బోట్స్వానా, బెల్జియం, ఇజ్రాయెల్, హాంకాంగ్‌లకు వ్యాపించింది. దక్షిణాఫ్రికాలోని జొహానెస్బర్గ్, కేప్‌టౌన్ విమానాశ్రయాల నుంచి రెండు విమానాల్లో నెదర్లాండ్స్ చేరుకున్న వారిలో 61 మందికి కొవిడ్ పాజిటివ్ తేలింది.
ఇక ఈ ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అప్రమత్తమైంది. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ప్రయాణికుల వద్ద 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ టెస్టు నెగటివ్ రిపోర్టు ఉండాల్సిందేనని విమానాశ్రయ అధికారులు స్పష్టం చేసి అమలు చేస్తున్నారు. అలాగే, విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాక మరోమారు పరీక్షలు నిర్వహిస్తున్నారు.