నోబెల్ గ్రహీత, జాన్ బీ గుడ్ ఎనఫ్ కన్నుమూత

గుడ్ ఎనఫ్ పరిశోధన ఆధారంగానే సోనీ నుంచి తొలి బ్యాటరీ

Nobel prize winner Goodenough, who made smartphones possible by inventing Lithium-Ion batteries, dies

టెక్సాస్ : నేడు స్మార్ట్ ఫోన్ లేనిదే ఓ గంట గడవని పరిస్థితి. స్మార్ట్ ఫోన్ నుంచే నిజ జీవితంలో ఎన్నో ముఖ్యమైన పనులను చక్కబెట్టుకుంటున్నాం. మరి స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణలో కీలకమైన లిథియం అయాన్ బ్యాటరీకి ఆద్యుడు, నోబెల్ పురస్కార గ్రహీత జాన్ బీ గుడ్ ఎనఫ్ తుది శ్వాస విడిచారు. నూరేళ్లు నిండిన ఆయన టెక్సాస్ లోని ఆస్టిన్ లో ఆదివారం మరణించినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

నేడు స్మార్ట్ ఫోన్లనే కాదు, ల్యాప్ టాప్ లు, టాబ్లెట్లు, ఎలక్ట్రిక్ వాహనాలకు లిథియం అయాన్ బ్యాటరీయే ఆధారంగా ఉండడం తెలిసిందే. 1980లో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో పనిచేసే సమయంలో గుడ్ ఎనఫ్ .. లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ క్యాథోడ్ బ్యాటరీని అభివృద్ధి చేశారు. బ్రిటిష్ కెమిస్ట్ డాక్టర్ విట్టింగ్ హమ్ అభివృద్ధి చేసిన డిజైన్ ను గుడ్ ఎనఫ్ మరింత మెరుగుపరిచారు. అధిక ఇంధన నిల్వ సామర్థ్యం, భద్రతను మెరుగుపరిచారు. లిథియం అయాన్ బ్యాటరీ ఆవిష్కరణలో ముఖ్యపాత్ర పోషించినప్పటికీ తర్వాతి కాలంలో ఆయన రాయల్టీని పొందలేదు. బ్రిటిష్ ఆటోమిక్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేషన్ తో బ్యాటరీ పరిశోధనపై హక్కులకు సంబంధించి సంతకం పెట్టేశారు.

లిథియం అయాన్ బ్యాటరీ సామర్థాలను గుర్తించిన స్విట్జర్లాండ్, జపాన్ శాస్త్రవేత్తలు వాటి పనితీరు పెంచడంపై దృష్టి పెట్టారు. లిథియంను గ్రాఫిటిక్ కార్బన్ లేయర్ తో రూపొందించడం వల్ల వాటి పనితీరు మెరుగుపడుతుందని, సామర్థ్యం, భద్రత పెరుగుతుందని గుర్తించారు. చివరికి 1991లో సోనీ సంస్థ గుడ్ ఎనఫ్ క్యాథోడ్, కార్బన్ అనోడ్ తో కలిపి ప్రపంచంలో తొలి భద్రమైన లిథియం అయాన్‌ రీచార్జబుల్ బ్యాటరీ రూపొందించింది. 2019లో 97 ఏళ్ల వయసులో డాక్టర్ గుడ్ ఎనఫ్ నోబెల్ పురస్కారం అందుకున్నారు. బ్యాటరీ టెక్నాలజీ అభివృద్ధిలో మరో ఇద్దరు శాస్త్రవేత్తలతో కలసి ఈ పురస్కారానికి నోచుకున్నారు.