పేదల ఓట్లకు పెద్దల పాట్లు!

ప్రజాస్వామ్యానికి ఎన్నికలే ఊపిరి. ఆ ఎన్నికలే ఒక ప్రహసనంగా మారు తుంటే ఇక ప్రజాస్వామ్యం ఎలా వర్ధిల్లు తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి అవకతవకలకు, అవినీతికి, అన్యాయాలకు పాల్పడకుండా సంఘంలో మంచివారిగా జీవించాలని త్రికరణశుద్ధిగా భావించే వారెందరో ఉన్నా మారిన పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవేమోననిపిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు పరులను ఎలా మోసం చేద్దామా అనే ఆలోచనలతో ఉన్నా చెడ్డ పనులు చేసే అవకాశం రాక మంచివారిగా కొందరు మిగిలిపోతున్నారేమోననిపిస్తున్నది.

తెలంగాణ రాష్ట్రంలో పురపాలక సంఘాలకు జరుగుతున్న ఎన్నికల తీరు చూస్తే ప్రజాస్వామ్యవాదులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యం అపహాస్యపాలవ్ఞతున్న విషయం చెప్పకనే చెబుతున్నది. మద్యం ఏరులైపారుతు న్నది. వాహనాలు ఇష్టానుసారంగా తిప్పుతున్నారు. అధి కార పార్టీ సహజంగానే మరో అడుగు ముందేఉంటుంది.

ఎన్నికల్లో నిష్పక్షపాతంగా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన కీలక పదవ్ఞల్లో ఉన్న కొందరు అధి కారులు కూడా పార్టీల కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్‌ కౌన్సిల్స్‌కు పోటీ చేసే అభ్యర్థులు లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. కొందరు ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బు, మద్యంతో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు.

ఒక ఇంట్లో ఐదు ఓట్లు ఉంటే ఒక పార్టీ వారు ఓటుకు ముప్ఫైనుంచి నలభైవేల రూపాయల వరకు పంపిణీ చేసినట్లు వార్తలు వస్తు న్నాయి. తెలంగాణాలో ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదిభట్ల మున్సిపాలిటీలో నగదు పంపిణీ అత్యధిక స్థాయిలో ఉందని ప్రచారం జరుగు తున్నది. ఉత్తర తెలంగాణాలో కొన్ని ప్రాంతాల్లో ఖర్చు కోట్లను దాటుతుందని చెబుతున్నారు. ఇంటింటికి మాటన్‌, చికెన్‌ ప్యాకెట్లు, మందుసీసాలు, బియ్యం బస్తాలు, నూనెడబ్బాల పంపిణీ నిరాటంకంగా జరిగి పోతున్నది. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకొని ఓటు తమకే వేయమని ఎవరికి వారు అందరూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

బహుశా ఇటీవల కాలంలో ఇంతపెద్ద ఎత్తున డబ్బు,మద్యం వెచ్చించిన దాఖలాలు లేవనే చెప్పొచ్చు. ఓటర్లు కూడా చాలా ప్రాంతాల్లో ఎవరు ఏమి ఇస్తారనే ఆశతో ఎదురుచూసే పరిస్థితులకు వచ్చేశారు. ఓటువేస్తే తమకేమి లాభమనే ఆలోచనవైపు మొగ్గు చూపిస్తున్నారు. ఫలితంగా ఎన్నికల వ్యయం ఊహించని రీతిలో పెరిగిపోతున్నది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు ఖర్చు చేయాల్సిన దానికన్నా యాభై,అరవై రెట్లు అధికంగా వ్యయం చేయాల్సి వస్తున్నది. అంతటి ఆర్థిక, అంగబలం ఉన్నవారే ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

పార్టీలు కూడా అలాంటి వారిని ముందు,వెనక ఆలోచించి ఈ అర్హతలే పరిగణనలోకి తీసుకొని బరిలోకి దించుతు న్నాయి. ప్రజలకు ఏమేరకు సేవ చేయగలుగుతారన్న విషయం దాదాపు ఏ పార్టీ పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రజాసేవ చేయాలనే తపన ఉన్నవారు అంతోఇంతో నిజాయితీతో వ్యవహరించేవారు. ఈ వ్యయాన్ని భరించలేక ఎన్నికలకు దూరమవ్ఞతున్నారు. ప్రజాస్వామ్యవ్యవస్థకు ఇది ఏమాత్రం మంచిదికాదు.

ఇంతడబ్బు ఖర్చుపెట్టి గెలిచిన వారు తమ పెట్టుబడి తిరిగి రాబట్టుకోవాలనే ఆలోచన ఉండటం సహజం. అందుకే రాజకీయంలో అవినీతి ఒక భాగం అయి పోయింది. అవినీతి పెరగడానికి పరోక్షంగా ప్రజలే కారకులనే విమర్శ కూడా చేసేవారున్నారు. నేరచరితులు, అవినీతిపరులు అందలం ఎక్కడంలో ప్రజల పాత్ర కీలకమనే వాదించేవారున్నారు. కానీ వీటన్నింటికి మించి ఎన్నికలను చట్టబద్ధంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఎన్నికల కమిషన్‌ ఒకటి ఉంది.

1951లో ఏర్పడిన ఎన్ని కల కమిషన్‌ నాటి నుండి ఎన్నో ఎన్నికలు నిర్వహిస్తుం ది. రాష్ట్రాలకు సంబంధించి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు ఉన్నాయి. విస్తృతమైన అధికారాలు ఆ కమిషన్‌కు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సంబంధించి కూడా ఎందరో అధికా రులు వచ్చివెళ్లినా 1990 డిసెంబరులో సిఇసి పీఠాన్ని తిరువళ్‌అక్కడపు నారాయణ అయ్యర్‌ శేషన్‌ అధిష్టించే వరకు ఈ కమిషన్‌కు ఇన్ని అధికారాలు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు.

కొందరికి హోదాలో గుర్తింపు వస్తే, మరికొన్ని సందర్భాల్లో వ్యక్తులతో హోదా కు గుర్తింపు వస్తుంది. శేషన్‌ హయాంలోనే ఎన్నికల కమిషన్‌ ఒకటి ఉందని సామాన్యులకు కూడా తెలిసింది. కోడ్‌ ఉల్లంఘించిన చోట ఎన్నికలు వాయిదా వేయడం, రద్దు చేయడం వంటి చర్యలు చేయడంలో కూడా వెను కాడలేదు.

రాజ్యాంగం 324 అధికరణాన్ని ఆయన సంపూ ర్ణంగా వినియోగించుకున్నారు.గోడల మీద రాతలు, చెవ్ఞ లను హోరెత్తించే లౌడ్‌స్పీకర్‌ హోరును కొంతమేరకైనా తగ్గించగలిగారు. తమ ఇష్టానుసారంగా వాహనాలను ఉపయోగించలేమని, తమపై నిఘా ఉందనే విషయాన్ని అభ్యర్థులు గ్రహించగలిగారు.కానీ ఆ తర్వాతదేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు క్రమేపీ పాత పద్ధతిలోకే వచ్చా యి.ఇక రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పరిధిలో స్థానిక సంస్థ లకు జరుగుతున్న ఎన్నికల ప్రచారం, ఓటర్లను ప్రభావ పెట్టిన తీరు, వెచ్చించిన డబ్బు,మద్యం చూస్తుంటే ప్రజా స్వామ్యవాదులే ముక్కున వేలేసుకుంటున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలే కాదు. ఏ ఎన్నికల నిర్వహణ కూడా రానురాను పతనావస్థకు చేరు కుంటున్నది. అక్రమాలు అన్నీఇన్నీకావ్ఞ. మొత్తంమీద ఎన్నికలు సక్రమంగా నిర్వ హించేందుకు రాజకీయాలకు అతీతంగా,త్రికరణశుద్ధిగా అందరూ నడుం కడితే తప్ప ప్రక్షాళన జరగదేమో.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/