తన భద్రతపైనే తప్ప జగన్ కు శాంతి భద్రతలపై శ్రద్ధ లేదుః అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు

acham naidu

అమరావతిః సిఎం జగన్ కు తన భద్రతపైనే తప్ప శాంతిభధ్రతలపై శ్రద్ధ లేదని టిడిపి ఏపీ చీఫ్ కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, తహసీల్దార్ రమణయ్య హత్యే దీనికి నిదర్శనమని మండిపడ్డారు. విశాఖ జిల్లా కొమ్మాదిలో తహసీల్దార్ ఇంట్లోకి వెళ్లి మరీ ఆయనను చంపేశారని చెప్పారు. మండల మేజిస్ట్రేట్ కే ఈ దుర్గతి పడితే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రశాంతతకు నిలయమైన ఉత్తరాంధ్రలో గతంలో ఎన్నడూ ఇలాంటి దారుణం జరగలేదన్నారు. వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి వచ్చాక ‘రాష్ట్రమంతా రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల పంచాగం’ అమలవుతోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. తహసీల్దార్ రమణయ్య హత్యపై వెంటనే విచారణ జరిపించి, దోషులను పట్టుకుని శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఐదేళ్లలో భూకజ్జాలు, ఆస్తుల విధ్వంసం, కమీషన్లు, సెటిల్ మెంట్లకు అడ్డాగా విశాఖను మార్చేశారని అచ్చెన్నాయుడు వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైఎస్‌ఆర్‌సిపి పాలనలో ప్రజలు, అధికారులపై బెదిరింపులు, దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, హత్యాయత్నాలు, శిరోముండనాలు నిత్యకృత్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌సిపి నేతల అవినీతి, అరాచకాలకు అడ్డుతగిలిన అధికారులను వేధింపులకు గురిచేస్తున్నారని, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

గతంలో ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మార్వో లక్ష్మీనారాయణరెడ్డిపై వైఎస్‌ఆర్‌సిపి నేత చెంచు రెడ్డి ఎమ్మార్వో ఆఫీసులో బహిరంగంగా దాడి చేశాడు. మంత్రుల నుంచి వాలంటీర్ల వరకు అధికారులపై దాడులు, బూతులతో విరుచుకుపడుతున్నారు. తన అవినీతి పనులకు సహకరించలేదన్న కోపంతో దళిత కలెక్టర్ గంధం చంద్రుడిపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి దౌర్జన్యం చేశారని, బదిలీ చేయించారని అచ్చెన్నాయుడు తెలిపారు. గుడివాడలో భూకబ్జాను అడ్డుకున్న వీఆర్వోను జేసీబీతో తొక్కి చంపేందుకు కొడాలి నాని అనుచరులు యత్నించారని అన్నారు. శాఫ్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి శాఫ్ అధికారులను మీటింగ్ లో అహంకారపూరితంగా ఇష్టమెచ్చినట్టు మాట్లాడి అగౌరవపరిచారు.

కార్ పార్కింగ్ విషయంలో మాజీ మంత్రి పేర్ని నాని పోలీసులను బండబూతులు తిట్టిన ఘటనను టిడిపి నేత అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. ప్రకాశం జిల్లాలో విద్యుత్ ఉద్యోగిపై వైఎస్‌ఆర్‌సిపి నాయకులు బహిరంగంగా దాడి చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయ ఉద్యోగులపై వైఎస్‌ఆర్‌సిపి నాయకులు, వాలంటీర్ల దాడులు, దౌర్జన్యాలకు లెక్కేలేదని విచారం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి పాలనలో ప్రజల ఆస్తులకే కాదు, వారి ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. రాష్ట్రంలో ఇంతటి ఘోరాలు నేరాలు జరుగుతుంటే హోంమంత్రి, పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం, వేధించడానికి మాత్రమే పోలీసులను ఉపయోగించుకుంటున్నారని సీఎం జగన్ పై టిడిపి ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు.