బీహార్‌ నూతన క్యాబినెట్‌లో మంత్రులకు శాఖల కేటాయింపు

CM Nitish Kumar

పాట్నాః బీహార్‌లో బిజెపితో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ తన నూతన క్యాబినెట్‌లోని మంత్రులకు శాఖలను కేటాయించారు. డిప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌదరికి ఆర్థిక, ఆరోగ్య, క్రీడా శాఖలను కట్టబెట్టారు. మరో ఉప ముఖ్యమంత్రి విజయ్‌ సిన్హాకు వ్యవసాయ, రోడ్లు భవనాలు, చిన్న నీటి పారుదల శాఖలను అప్పగించారు. అత్యంత కీలకమైన హోంశాఖను మాత్రం నితీశ్‌కుమార్‌ తన దగ్గరే అట్టిపెట్టుకున్నారు. వీరితోపాటు మరో ఆరుగురు మంత్రులు విజయ్‌ కుమార్‌ చౌదరి, విజేంద్ర ప్రసాద్‌ యాదవ్‌, డాక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌, శ్రవణ్‌ కుమార్‌, సంతోష్‌ కుమార్‌ సుమన్‌, సుమిత్‌ కుమార్‌ సింహాలకు కూడా సీఎం నితీశ్‌ వివిధ శాఖలను కేటాయించారు.

కాగా, నితీశ్‌కుమార్‌ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీచేశారు. అనంతరం జేడీయూ-బిజెపి సంకీర్ణ సర్కారు ఏర్పాటైంది. తర్వాత ఏడాదికే బిజెపితో విభేదాలు తలెత్తడంతో ప్రభుత్వాన్ని కూల్చి, ఆర్జేడీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి, నితీశ్‌ మళ్లీ సీఎంగా ప్రమాణం చేశారు. ఇటీవల ఆర్జేడీతో కూడా విభేదాలు తలెత్తడంతో ఇప్పుడు ఆర్జేడీ-జేడీయూ ప్రభుత్వాన్ని కూల్చేశారు. మళ్లీ బిజెపితో కలిసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీహార్‌ బిజెపి ముఖ్య నేతలు సామ్రాట్‌ చౌదరి, విజయ్‌ సిన్హాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. తాజాగా కొత్త క్యాబినెట్‌లోని మంత్రులందరికీ శాఖలు కేటాయించారు.