చంద్రబాబు రిమాండ్‌ను పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు

జైలులో తన సెక్యూరిటీపై అనుమానాలు వ్యక్తం చేసిన చంద్రబాబు

chandrababu-judicial-remand-extended-till-november-1

అమరావతిః స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టిడిపి చంద్రబాబు రిమాండ్ ను ఏసీబీ కోర్టు మరోసారి పొడిగించింది. చంద్రబాబు రిమాండ్ నేటితో ముగియనుండడంతో పోలీసులు ఆయనను వర్చువల్ గా జడ్జి ముందు ప్రవేశపెట్టారు. అనంతరం రిమాండ్ ను నవంబర్ 1 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో జైలులో తన సెక్యూరిటీ విషయంలో పలు అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు కోర్టుకు తెలిపారు.

దీంతో భద్రత విషయంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా లిఖితపూర్వకంగా అందించాలని కోర్టు ఆయనకు సూచించింది. వాటిని వివరిస్తూ జైలు నుంచి లేఖ రాయాలని జడ్జి చెప్పారు. ఆ లేఖను తనకు అందజేయాలని జైలు అధికారులను ఆదేశించారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో జడ్జి స్పందించారు. చంద్రబాబు ఆరోగ్యంపై అధికారులను ఆరా తీశారు. ఆయన మెడికల్ రిపోర్టులు కోర్టుకు అందజేయాలని ఆదేశించారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.