ప్రవళిక ఆత్మహత్య కేసు శివరామ్‌ను అరెస్టు చేసిన పోలీసులు

పరారీలో ఉన్న శివరామ్ ను మహారాష్ట్రలో అరెస్టు చేసిన పోలీసులు

shivaram-rathod-is-arrested-at-thane-in-pravallika-suicide-case

హైదరాబాద్‌ః రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రవళిక ఆత్మహత్యకు కారణమైన నిందితుడు, ఆమె ప్రియుడు శివరామ్ ను అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ నెల 13న ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడగా.. అప్పటి నుంచి శివరామ్ పరారీలో ఉన్నాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడి కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. ఈ క్రమంలో శివరామ్ మహారాష్ట్రకు పారిపోయినట్లు సమాచారం అందడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. థానెలో శివరామ్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ఇంతవరకూ అధికారికంగా ప్రకటించలేదు.

ప్రవళిక ఆత్మహత్యపై ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో శివరామ్ పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, తన కూతురు మరణానికి కారణమయ్యాడని ఆరోపిస్తూ ప్రవళిక తల్లి ఓ వీడియో సందేశం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రవళిక తల్లిని, సోదరుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్ కు పిలిపించుకున్నారు. కూతురు బలవన్మరణంతో బాధపడుతున్న ఆ తల్లిని ఓదార్చారు. మరోవైపు, ప్రవళిక కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని, ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.