వివేకా కేసు విషయంలో జగన్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు : గౌతమ్ సవాంగ్

దోషులకు శిక్ష పడాలనే జగన్ చెప్పేవారు: మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్

అమరావతి: ఏపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు విషయంలో సీఎం వైఎస్ జగన్‌పై వస్తున్న ఆరోపణలపై మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. వివేకా కేసు విషయంలో జగన్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని అన్నారు. డీజీపీగా ఉన్నప్పుడు తాను వ్యాఖ్యానించినట్టుగా పేర్కొంటూ వార్తా పత్రికల్లో వస్తున్న కథనాలపై సవాంగ్ స్పందించారు. వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందన్న ఉద్దేశంతోనే స్పందిస్తున్నట్టు పేర్కొన్నారు.

వివేకా హత్య కేసులో జగన్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, పైపెచ్చు కేసును నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని, దోషులకు శిక్ష పడేలా చూడాలనే తనతో చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. వివేకానందరెడ్డి, అవినాశ్‌రెడ్డి కుటుంబాలు తనకు రెండు కళ్లు లాంటివని మాత్రమే జగన్ చెప్పారని అన్నారు. సెప్టెంబరు 2019లో వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి తనను కలిసినప్పుడు ఇదే విషయాన్ని వారికి చెప్పానని అన్నారు. తాను డీజీపీగా ఉండగా అవినాశ్‌రెడ్డి కానీ, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి కానీ, డి.శివశంకర్‌రెడ్డి కానీ ఏనాడు తనను కలవలేదని సవాంగ్ స్పష్టం చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/