హైద‌రాబాద్‌లో సడెన్ గా దచ్చికొట్టిన వ‌ర్షం

A sudden downpour in Hyderabad

హైదరాబాద్ లో సడెన్ భారీ వర్షం కురిసింది. మంగ‌ళ‌వారం సాయంత్రం ఒక్కసారిగా చ‌ల్ల‌ని గాలులతో వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. నాంప‌ల్లి, కోఠి, అబిడ్స్, ల‌క్డీకాపూల్, ఖైర‌తాబాద్, పంజాగుట్ట‌, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, మాదాపూర్, మెహిదీప‌ట్నం, లంగ‌ర్ హౌజ్, మ‌ల‌క్‌పేట్, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, ఎల్బీన‌గ‌ర్, ఫ‌ల‌క్‌నూమా, చార్మినార్, నాచారం, తార్నాక‌, హ‌బ్సిగూడ‌, రాంన‌గ‌ర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్క‌డ‌ప‌ల్లి, ముషీరాబాద్, సికింద్రాబాద్, ప్యార‌డైజ్, బేగంపేట్, స‌నత్ న‌గ‌ర్‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో వర్షం పడింది.

వ‌ర్షం కార‌ణంగా హైద‌రాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప‌లు చోట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌లిగింది. ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డ‌టంతో పోలీసులు క్ర‌మ‌బ‌ద్దీక‌రించారు. కాగా వారం రోజులుగా మాండౌస్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. జిల్లాలతో పాటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో రెండు రోజులుగా విస్తారంగా వానలు పడుతున్నాయి. బుధవారం వరకు వర్షాలు పడతాయని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.