టికాంగ్రెస్ లో కొనసాగుతున్న రాజీనామాల పర్వం

టికాంగ్రెస్ లో నిత్యం వివాదాలు కొనసాగుతూనే ఉంటాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుంది.. పార్టీ ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏ ఒక్క నేత కూడా ఆలోచించడం లేదు. నిత్యం ఏదొక పంచాయితీతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా టీపీసీసీ కొత్త కమిటీలను అధిష్ఠానం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ కమిటీ కూర్పుపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే కొండా సురేఖ , పీసీసీ సీనియర్‌ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్‌ లు రాజీనామా చేయగా..తాజాగా మరో ఇద్దరు నేతలు తమ రాజీనామా లేఖలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి పంపించారు.

ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి భరత్ చౌహన్, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పదవికి చారులత రాఠోడ్ రాజీనామా చేశారు. పదవుల విషయంలో లంబాడీ గిరిజన నాయకులకు తీవ్ర అన్యాయం చేశారని, తమ సామాజిక వర్గాన్ని పార్టీ పట్టించుకోలేదని ఆరోపించారు. పదవుల విషయంలో తమకు అన్యాయం చేసినప్పుడు తామెందుకు పదవుల్లో కొనసాగాలంటూ భరత్ చౌహాన్, చారులత రాఠోడ్ ప్రశ్నించారు. పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్తామని వారిద్దరు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో లంబాడీ గిరిజన నాయకులకు ఒక్కరికీ కూడా టీపీసీసీ పదవుల్లో చోటు దక్కకపోవడం అన్యాయమని విమర్శించారు. రాష్ట్ర పార్టీ తప్పిదానికి ఇది నిదర్శనమని, ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న వారిని పట్టించుకోవడం లేదని భరత్ చౌహాన్, చారులత రాఠోడ్ ఆరోపించారు. ఎంతోమంది పార్టీని వీడినా.. తాము పార్టీని నమ్ముకుని ఉన్నామని, తమలాంటి వారిని టీపీసీసీ పట్టించుకోవడం లేదన్నారు.