ఏపీలో రేషన్ షాపుల బంద్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న డీలర్లు

ఆంధ్రప్రదేశ్ లో మంగళవారం నుండి రేషన్ షాపులు బంద్ కు పిలుపునిచ్చారు డీలర్లు..ఈ ప్రకటన చేసిన కొద్దీ గంటల్లోనే ఆ ప్రకటనను వెనక్కు తీసుకున్నారు. ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండాది వెంకట్రావు ఈ మేరకు వెల్లడించారు. అయితే, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వం స్పందించాలన్న ఆయన, కమీషన్ బకాయిలు చెల్లించడంతో పాటు, గోనె సంచులకు ఎప్పటిలాగా డబ్బులు ఇవ్వాలని జగన్ సర్కారుని డిమాండ్ చేశారు. ఏపీలో రేషన్ దుకాణాలకు సంబంధించి అధికారులు మారినప్పుడుల్లా విధానాలను, నిబంధనలు మార్చడం సరికాదని వెంకట్రావ్ అభిప్రాయపడ్డారు.

డీడీ నగదు వాపసు, ధరల వ్యత్యాస సర్క్యులర్లను అమలు చేయాలని, డీలర్ల నుంచి ఐసీడీఎస్ కు మళ్లించిన కందిపప్పుకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని, 2020 మార్చి 29 నుంచి ఇప్పటిదాకా ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ నుంచి డీలర్లకు రావాల్సిన కమిషన్ బకాయిలు చెల్లించాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేదాకా నిరసనలు కొనసాగిస్తామన్న రేషన్ డీలర్లు.. ప్రస్తుతానికి బంద్ వాయిదా వేసినప్పటికీ, దుకాణాల్లో సరుకుల దిగుమతి, పంపిణీనిని నిలిపేస్తున్నామని, అయినాకూడా ప్రభుత్వం దిగిరాకపోతే సంపూర్ణ బంద్‌ కు దిగుతామని స్పష్టం చేశారు.