పెన్షన్‌ కోసం మండు టెండలో చెప్పులేకుండా 70 ఏళ్ల వృద్ధురాలు కాలినడక

A 70-year-old woman is on foot in Mandu Tenda for pension

వృద్ధులకు ‘వృద్దాప్య పెన్షన్లు’ ఎంతో ఆసరాగా నిలుస్తాయి. మలి వయసులో సంపాదన లేదని బాధపడే వారికి, చిన్నా చితక ఖర్చులకు ఇంట్లో వాళ్ల దగ్గర చెయ్యి చాచటానికి ఇబ్బంది పడేవారికి పెన్షన్లు ఓ వరంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వాలు 2నుంచి 3 వేల రూపాయల పెన్షన్లు ప్రతీ నెలా ముసలివారికి అందిస్తున్నాయి. అయితే, టెక్నాలజీ కారణంగా కొన్ని సార్లు పెన్షన్‌ అందటంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా బయోమెట్రిక్‌ విధానాల కారణంగా కొంతమంది ముసలివాళ్లు చాలా ఇబ్బందిపడుతున్నారు.

ముసలి తనంలో చేతి వేళ్లు పాడవటం.. దాని వల్ల థంబ్‌ ఇంప్రెషన్‌ సరిగా పడకపోవటం వల్ల వారు పెన్షన్ తీసుకోలేకపోతున్నారు. దీంతో పెన్షన్‌ తీసుకోవటం కోసం బ్యాంకులు లేదా పెన్షన్‌ ఇచ్చే అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. తాజాగా, ఒరిస్సాకు చెందిన సూర్య హరిజన్‌ అనే ఓ 70 ఏళ్ల వృద్ధురాలు పెన్షన్‌ తీసుకోవటం కోసం మండు టెండలో చెప్పులేకుండా ప్రయాణం చేయడం.. నడవటానికి కూడా ఇబ్బందిపడుతున్న ఆమె విరిగిపోయిన కుర్చీ సాయంతో పెన్షన్‌ కోసం బ్యాంకు దగ్గరకు వెళ్లిన ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

ఆమె పడుతున్న కష్టాలను చూసి నెటిజన్లు చలించిపోయారు. వీడియోపై కామెంట్లు చేస్తూ బ్యాంకు అధికారులపై మండిపడటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే సదరు బ్యాంకు అధికారులు స్పందించారు. బ్యాంకు మేనేజర్‌ మాట్లాడుతూ.. ‘‘ ఆమె చేతి వేళ్లు పాడయ్యాయి. అందువల్ల డబ్బు విత్‌డ్రా చేసుకోవటం సమస్యగా మారింది. అయినప్పటికి మేము మామూలు పద్దతిలో ఆమెకు 3 వేల రూపాయలు ఇచ్చాము. త్వరలో ఆమె ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరిస్తాం’’ అని తెలిపారు.