మరోసారి హైదరాబాద్ కు అరుదైన ఘనత …

హైదరాబాద్ మహానగరం మరోసారి తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. వరుసగా రెండోసారి ట్రీ సిటీగా ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందిస్తున్న నగరాలను గుర్తించి వాటిని ట్రీ సిటీస్‌గా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్, ఆర్బొర్‌ డే ఫౌండేషన్ సంయుక్తంగా ఎంపిక చేస్తాయి. తాజాగా అవి గుర్తించిన నగరాల్లో వరుసగా రెండోసారి హైదరాబాద్‌కు చోటు దక్కింది.

రెండేళ్లకో సారి ఈ ట్రీ సిటీస్ ఎంపిక చేస్తుండగా.. 2020లోనూ హైదరాబాద్ ట్రీ సిటీగా గుర్తింపు పొందింది. గత రెండేళ్లల్లో నగరంలో 3 కోట్ల 50 లక్షల 56వేల 635 మొక్కలు నాటినట్టు ఆర్బోర్ డే ఫౌండేషన్ పేర్కొంది. ఇందుకోసం దాదాపు 500 గంటలను సమయాన్ని కేటాయించాల్సి ఉంటుందని అభిప్రాయపడిన ఫౌండేషన్ హైదరాబాద్​కి అభినందనలు తెలిపింది. హైదరాబాద్​ వరుసగా రెండో సారి ట్రీ సిటీ గుర్తింపు దక్కించుకోవటం పట్ల ఎంపీ సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్రీ సిటీ గుర్తింపునకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.