ఢిల్లీలో పొగమంచు.. 80కిపైగా విమానాలు ఆలస్యం

పొగమంచు కారణంగా పలు రైలు సర్వీసులు కూడా ఆలస్యం

80-flights-several-trains-delayed-after-dense-fog-envelops-delhi

న్యూఢిల్లీః దేశరాజధాని ఢిల్లీని చలి పులి వణికిస్తోంది. అనేక ప్రాంతాల్లో దట్టంగా పొగ మంచు కమ్ముకోవడంతో ప్రజారవాణాపై ప్రభావం పడుతోంది. శనివారం 80 ఫ్లైట్ సర్వీసులు ఆలస్యం అయ్యాయని ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఎదురుగా ఉన్నవి కనిపించనంత దట్టమైన పొగ కారణంగా రైలు సర్వీసులు కూడా ఆలస్యమయ్యాయి. ప్రయాణాలు ఆలస్యం కావడంతో పలువురు నెట్టింట తమ ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు.

ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో 50 మీటర్ల దూరంలోనివేవీ కనిపించనంత దట్టంగా పొగ కమ్ముకుంది.

భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) ప్రకటన ప్రకారం, జనవరి 5 తరువాత ఉత్తరాదిన చలి మరింత తీవ్రమవుతుంది. జనవరి 11 వరకూ చలితో అవస్థలు తప్పవని ఐఎమ్‌డీ పేర్కొంది. పలు రాష్ట్రాల్లో రేపు చలి తీవ్రత భారీగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా, రాబోయే 24 గంటల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో స్వల్ప స్థాయిలో వర్షం, హిమపాతానికి అవకాశం ఉందని వెల్లడించింది.