చంద్రునిపై ‘అణు విద్యుత్ ప్లాంట్‌’ రష్యా-చైనా ప్రణాళిక

nuclear-power-on-the-moon-russia-china-working-on-a-plan

మాస్కోః రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్ కాస్మోస్ కీలక ప్రకటన చేసింది. 2033-35 నాటికి చంద్రుడిపై ‘అణు విద్యుత్ ప్లాంట్‌’ను ఏర్పాటు చేయాలని చైనా, రష్యాలు యోచిస్తున్నాయని రోస్ కాస్మోస్ హెడ్ యూరి బోరిసోవ్ మంగళవారం ప్రకటించారు. ఈ దిశగా రష్యా, చైనా సంయుక్తంగా పని చేస్తున్నాయని, ఈ మిషన్‌లో రష్యా ‘అణు అంతరిక్ష శక్తి’ నైపుణ్యాలు దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఏదో ఒక రోజు జాబిల్లిపై ఆవాసాల నిర్మాణానికి అనుమతి దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

‘‘చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాం. 2033-2035 నాటికి ఏర్పాటు చేస్తాం. ఈ దిశగా చైనాకు చెందిన సహోద్యోగులతో కలిసి పనిచేస్తున్నాం. చంద్రుడి ఉపరితలంపై పవర్ యూనిట్‌ ఏర్పాటు, విద్యుత్ పంపిణీ చేయాలనుకుంటున్నాం. ఇది చాలా కఠినమైన సవాలు. మనుషులతో పనిలేకుండా ఆటోమేటిక్ మోడ్‌లో దీనిని చేయాల్సి ఉంటుంది. భవిష్యత్‌లో సౌర ఫలకాలు చంద్రుడిపై ఆవాసాలకు తగినంత విద్యుత్‌ను అందించలేవు. అణుశక్తి ఈ పనిని చేయగలదు’’ అని బోరిసోవ్ వివరించారు.

అణుశక్తితో నడిచే కార్గో స్పేస్‌షిప్‌ను నిర్మించాలని రష్యా భావిస్తోందని బోరిసోవ్ వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అణు రియాక్టర్‌ను చల్లబరచడంతో పాటు ఇతర సవాళ్లకు పరిష్కారాలను కనుగొన్నామని, అన్ని సాంకేతిక ప్రశ్నలను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. స్పేస్ టగ్‌బోట్‌ (నౌక లాంటిది) తయారీపై పనిచేస్తున్నామని తెలిపారు. ఈ భారీ సైక్లోపియన్ ‘టగ్‌బోట్’ ద్వారా అణు రియాక్టర్, హై-పవర్ టర్బైన్‌లు సాధ్యమవుతాయని, పెద్ద పెద్ద కార్గోలను ఒక కక్ష్య నుంచి మరొక కక్ష్యకు రవాణా చేయడం సాధ్యమవుతుందని బోరిసోవ్ వివరించారు. అంతరిక్ష శకలాల సేకరణ, అనేక కార్యక్రమాలలో పాల్గొనడానికి టగ్‌బోట్ ఉపయోగపడుతుందని చెప్పారు.