నైజీరియాలో బోల్తాపడిన పడవ.. 76 మంది జలసమాధి
ప్రమాద సమయంలో బోటులో 85 మంది

లాగోస్: నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. ఓ బోటు 85 మందితో వెళ్తుండగా నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో పడవ బోల్తా పడింది. రాష్ట్రంలోని ఒగబరు ప్రాంతంలో 85 మందితో ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు మునిగిపోయిందని, మొత్తం 76 మంది మృతి చెందారని అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ కార్యాలయం పేర్కొంది. ఆయన ఆదేశాలతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర సేవల సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
బాధితుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి భద్రత కోసం తాను ప్రార్థిస్తున్నానని అధ్యక్షుడు బుహారీ పేర్కొన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, నదిలో నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో సహాయ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడిందని సహాయక సిబ్బంది తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనంతగా వరద ఉద్ధృతి ఉందని అధికారులు పేర్కొన్నారు. సహాయక కార్యక్రమాలకు హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. అనంబ్రా రాష్ట్ర గవర్నర్ చార్లెస్ సోలెడో మాట్లాడుతూ.. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం వారి కోసం శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మరోవైపు ఈ నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పడవలోని ప్రతిఒక్కరి ఆచూకీ లభించేవరకు సహాయక చర్యలు కొనసాగిస్తామని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/movies/