దేశంలో కొత్తగా 7,240 కరోనా కేసులు

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 32,498

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న కేసులతో ఫోర్త్ వేవ్ వస్తుందేమోననే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 7,240 కొత్త కేసులు నమోదయ్యాయి. ముందు రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య దాదాపు 40 శాతం పెరిగింది. అంతకు ముందు రోజు 5,233 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో 3,591 మంది కరోనా నుంచి కోలుకోగా… 8 మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 32,498కి చేరుకుంది.

తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 4,31,97,522కి పెరిగింది. వీరిలో మొత్తం 4,26,40,301 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,24,723 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసుల్లో సగానికి పైగా కేసులు మహారాష్ట్ర, కేరళలోనే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, కర్ణాటక, హర్యానా ఉన్నాయి. పెరిగిన కేసులతో రోజువారీ పాజిటివిటీ రేటు 1.62 శాతానికి చేరుకుంది. రికవరీ రేటు 98.71 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 15,43,748 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/