హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎడతెరపిలేకుండా భారీ వర్షం … ఏడుగురు మృతి

సిమ్లాలో శివాలయం కూలి మరో తొమ్మిది మంది దుర్మరణం

7-killed-in-cloudburst-at-himachal-pradesh

సిమ్లాః హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షానికి ఓ కుటుంబంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. భారీ వర్షం కారణంగా ఉప్పెనలా ముంచెత్తిన వరదలో రెండు ఇళ్లు కొట్టుకుపోయాయి. అందులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. సోలన్ జిల్లా జాడోన్ గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వరదలో చిక్కుకున్న మరో ఐదుగురిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. కాగా, ఈ సీజన్ లో ఇప్పటి వరకు కురిసిన వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ లో 257 మంది ప్రాణాలు కోల్పోయారని, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 వేల కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు.

గడిచిన 24 గంటలుగా భారీ వర్షం కురుస్తుండడంతో జాడోన్ గ్రామాన్ని వరద ముంచెత్తింది. దీంతో రెండు ఇళ్లతో పాటు ఓ గోశాల వరద నీటిలో కొట్టుకుపోయింది. విషయం తెలిసిన వెంటనే గ్రామానికి చేరుకున్న అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. వర్షాల కారణంగా రహదారులపై కొండచరియలు, చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండడంతో హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ పరీక్షలను వాయిదా వేసింది. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

మరోవైపు, ఉత్తరాఖండ్ లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నందాకినీ నది డేంజర్ మార్క్ ను దాటి ప్రవహిస్తోంది. ఆదివారం రాత్రి చమోలీ జిల్లా నందనగర్ ఏరియాలోని ఇళ్లల్లోకి వరదనీరు చేరింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. నందనగర్ ఏరియాలోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. నందాకినీ నదితో పాటు రాష్ట్రంలోని పలు ఇతర నదులు కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.

సిమ్లాలోని సమ్మర్ హిల్ ఏరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడి శివాలయంలో కొంతభాగం కూలిపోయింది. దీంతో తొమ్మిది మంది భక్తులు చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆలయంలో 40 నుంచి 50 మంది భక్తులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. కొండచరియల కింద 15 నుంచి 20 మంది చిక్కుకుని మరణించి ఉండొచ్చని సిమ్లా డిప్యూటీ కమిషనర్ తెలిపారు.