కేసీఆర్ రూ.లక్ష సాయం కోసం 5.50 లక్షల బీసీలు దరఖాస్తులు

తెలంగాణలో కులవృత్తులు, చేతివృత్తులు చేస్తున్న వెనుకబడిన వర్గాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు.. సర్కారు ప్రకటించిన రూ.లక్ష సాయానికి దరఖాస్తు పూర్తి అయ్యింది. మంగళవారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా 5.50 లక్షల దరఖాస్తులు అందించారు. అయితే.. దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన క్యాస్ట్, ఇన్‌కం సర్టిఫికేట్ల జారీలో జాప్యం వల్ల చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోయారు.

వారం రోజులుగా ఎమ్మార్వో ఆఫీసుల్లోనే రోజుల తరబడి పడిగాపులు పడాల్సి వచ్చింది. అందులో మొదటి రోజు వెబ్‌సైట్ ఓపెన్ కాకపోవటం.. తర్వాత సర్టిఫికేట్ల జారీకి సర్వర్ ఓపెన్ కాకపోవటంతో.. చాలా వరకు దరఖాస్తులు పెండింగ్‌ ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దరఖాస్తు గడువు పెంచాలని ప్రజలు డిమాండ్ చేసినప్పటికీ.. దరఖాస్తుల గడువు పెంచటం లేదని మంత్రి గంగుల స్పష్టం చేశారు. గడువులోగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 20వ తేదీ తర్వాత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టి దశలవారీగా జాబితాను రూపొందిస్తారు. ప్రతినెలా ప్రకటించిన లబ్ధిదారులకు 15వ తేదీన లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తారు.