ఓంకారమే సృష్టిసారం

నేడు శివరాత్రి సందర్భంగా..

Lord Shiva

శివభక్తులకు శివరాత్రి అంతటి పర్వదినం ఇంకొకటి ఉండదు. శివరాత్రి రోజున ప్రతి శైవక్షేత్రం కూడా శివనామ స్మరణతో మారుమోగుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఆ పరమేశ్వరుడే వీరిని తనలో కలిపేసుకున్నాడేమో అనేంత ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతి సంవత్సరం శివరాత్రి పండుగ మాఘమాసంలో కృష్ణ చతుర్దశినాడు వస్తుంది. ఈ రోజున శివభక్తులంతా ఈశ్వరునికి అభిషేకాలు చేసి ఉపవాసం ఉండి, జాగరణ చేస్తారు.

శివపురాణాలు, శివకీర్తనలు, శివ్ఞనికి సంబంధించిన శ్లోకాలు వింటూనే గడుపుతారు. రుద్రాబి µషేకాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, లింగోద్భవకాలంలో అభిషేకాలు చేస్తారు. ఒక్క శివరాత్రి రోజున దివారాత్రాలు ఉపవాసం ఉండి, జాగరణ చేసేవారు సంవత్సరమంతా శివారాధన చేసినటువంటి ఫలితాలను పొందుతారు. మాఘమాసంలో కృష్ణ చతుర్దశినాడు కృష్ణపక్షంలో చంద్రుని యొక్క కళలు దినదినం క్షీణించి చతుర్దశినాడు మాత్రం ఒక్క కళే అనగా మనసులో మిగిలినట్టి పదహారు మాలిన్యాలలో ఒక్కటి మాత్రమే మిగిలి ఉంటుంది.

ఆ ఒక్కదానిని కూడా దూరం చేసుకోవడానికి శివరాత్రి రోజున శివారాధన, ఉపవాసం, జాగరణ, దైవచింతనలో గడిపితే చాలు. శివరాత్రి రోజున అభిషేక ప్రియుడైనటువంటి ఈశ్వరునికి వీలయినన్ని ద్రవపదార్థాలతో అభిషేకం చేయవచ్చు. లేకపోయినట్లయితే చెంబుతో నీళ్లుపోసి విభూది రాసి, ఒక మారేడు లేదా బిల్వదళానితో అర్చన చేస్తే అదే మోక్షం, అదే శుభం. పరమేశ్వరుడు తమోగుణం కలిగినవాడు. మూడు కన్నులతో నీలకంఠధారిగా, తలపైన జటాజూటం, చంద్రవంకను కలిగి ఒళ్లంతా భస్మం పూసుకుని, చేతిలో ఢమరుకం, మెడలో సర్పాలు, గజచర్మ వస్త్రం, త్రిశూలం, కపాలం, శంఖం పూరిస్తూ, జ్ఞానముద్రను ప్రదర్శిస్తూ ఉంటాడు.

ఆయనకే ఎన్నో నామాలు ఈశ్వరుడు, శంకరుడు, శివ్ఞడు, రుద్రేశ్వరుడు, గంగాధరుడు, కాశీవిశ్వేశ్వరుడు. శివ్ఞడు భోళాశంకరుడు. అభిషేక ప్రియుడు కావడంచేత ఆ శివలింగంపై నీళ్లుపోసి, భస్మం రాసి మారేడు దళాన్ని ఉంచితే కష్టాలను పోగొట్టి సర్వశుభాలను కలిగిస్తాడు. అభిషేకాల పేరుతో శివ్ఞని స్పృశించి శైవభక్తులు ఎంతో మానసికానందాన్ని పొందుతారు. శివార్చనలో గొప్ప మహిమ కలిగినది మహాలింగార్చన, జ్యోతిర్లింగార్చన. మన సనాతన ధర్మంలో వేదాలకు గొప్పస్థానం ఉందని చెప్పవచ్చు. స్వతః ప్రూనమయినటువంటి వేదం అపౌరుషేయం. రుగ్వేదంలో ‘ఏకం సత్‌ విప్రా బహుదావదంతి అంటారు.

అనగా సత్‌ పదార్థాం ఒక్కటే అని అర్ధం. అయితే యజుర్వేదంలో తైత్తిరీయ సంహితలో రుద్రాద్యాయం శివపంచాక్షరిని ‘నమః శ్శివాయ అని ‘ఓం నమశ్శివాయ అని తెలియజేయబడినది. ‘ఓం నమఃశ్శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని శైవభక్తులు, శివారాధకులు పఠిస్తూ, జపిస్తూ ఎంతో తన్మయత్వాన్ని పొందుతారు. ‘శివా అనే పదం పార్వతీపరమేశ్వరులిద్దరికీ వర్తిస్తుంది. ‘శివ అనగా ఈశ్వరుడు, ‘శివా అనగా పార్వతీదేవి అని అర్ధం. శివ్ఞడు నటరాజు. ప్రదోషకాలంలో (సంధ్యాసమయంలో) శివ్ఞడు నాట్యం చేస్తుంటాడు. ఈ సమయంలో కనుక శివ్ఞన్ని దర్శించుకున్నా, పూజించినా, ఆరాధించినా గొప్ప గొప్ప ఫలితాలు కలుగుతాయి.

యతీశ్వరులు కూడా ఆ సమయంలో శివ్ఞన్ని ధ్యానం చేస్తూ అభిషేకార్చనలతో ఆరాధిస్తారు. శివ పంచాక్షరి మంత్రమును జపిస్తూ పుట్టమన్నుతో 1008 శివలింగాలను చేసి వాటిని మహాలింగాకృతిగా ఒక ఆసనం మీద పేర్చి, నమక చమక, ఏకాదశ రుద్రంతో అభిషేకం చేసి, అర్చనలు జరిపిస్తే దానిని ‘మహాలింగార్చన అంటారు. అదేవిధంగా 330 ప్రమిదలను మహాలింగాకృతిలో పేర్చి జ్యోతులను వెలిగించినట్లయితే దానిని ‘జ్యోతిర్లింగార్చన అంటారు. ఈ రెంటినీ శివరాత్రి రోజున చేసినట్లయితే విశేషమయిన ఫలితాలు పొందుతారు.

మనదేశంలో నాలుగు దిక్కుల్లో నాలుగు పేర్లతో స్వయంభువై శివ్ఞడు కొలువ్ఞన్నాడు. ఉత్తరభాగంలో హిమాలయాల్లో ‘కేదారేశ్వరుడుగా, దక్షిణాన ‘రామేశ్వరుడుగా, పడమర ‘సోమేశ్వరుడుగా, తూర్పు ముఖాన ‘వైద్యనాథేశ్వరుడుగా సకలజనులను రక్షిస్తున్నాడు.
మనిషి మనుగడకు ఈశ్వరారాధన చాలా ఉత్తమంగా చెప్పవచ్చు. క్షీరసాగరమథనంలో జనించినటువంటి హాలా హలాన్ని లోకాలన్నింటినీ తగలబడకుండా తన చేతిలో నేరేడు పండులాగా చేసి, జగన్మాత యొక్క అనుమతితో తన కంఠమున ధరించినవాడై త్యాగానికి ప్రతీకగా నిలిచాడు. తన మూడవ నేత్రంతో తపోభంగం చేయడానికి ప్రయత్నించిన మన్మథుని భస్మం చేసి కామప్రళయం గావించిన జితేంద్రియుడు పరమేశ్వరుడు. త్రిపురాసురుని సంహరించి దేవతలకు జ్ఞానప్రాప్తి ప్రసాదించినవాడు మహేశ్వరుడు.

స్థూల, సూక్ష్మ కారణ శరీరంనకు అవతల ఉన్నటువంటి శుద్ధ పరబ్రహ్మ తత్త్వమును ఆవిష్కరింపచేయుటయే త్రిపురసంహారంలోని నిగూఢము. జ్ఞానప్రదాత అయిన పరమేశ్వరుని శాస్త్రోక్తంగా అభిషేక, అర్చనాలతో పూజించి తరించాలి. ఏనుగు, సర్పము, సాలెపురుగు ఆ పరమశివ్ఞన్ని ఆరాధించి ముక్తి పొందిన గొప్పక్షేత్రం శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తిలో పరమేశ్వరుడు వాయులింగం. శ్రీశైలం ద్వాదశ జోతిర్లింగాల్లో ఒకటి. అంతేకాకుండా అష్టాదశ పీఠాల్లోను ఒకటి. ఇక్కడ భ్రమరాంబా సమేతుడైన స్వామి మల్లిఖార్జునుడిగా శ్రీచక్రరూపమైన శ్రీశైలంలో భక్తులకు దర్శనమిస్తాడు. మూడవది ద్రాక్షారామం. దక్షయజ్ఞం జరిగిన ప్రదేశం ద్రాక్షారామం.

అమ్మవారి శక్తి పీఠాలలో మాణిక్యాంబ ద్రాక్షారామంలో భీమేశ్వరుని పేరుతో పిలిచే పరమేశ్వరునితో కొలువైంది. ద్రాక్షారామం, క్షీరారామం, కుమారారామం, అమరారామం, భీమారామంగా పంచారామాలుగా త్రిలింగదేశంలో సకల పూజలందుకుంటున్నాయి. వేములవాడలో శ్రీరాజరాజేశ్వరుడిగా, కాళేశ్వరంలో కాళేశ్వర, ముక్తేశ్వరుడిగా రామప్పలో రుద్రేశ్వరుడిగా స్వామి నిత్య పూజలందుకుంటున్నాడు.

శివపంచాక్షరీ మంత్రం ఎంత గొప్పదంటే పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేటప్పుడు ప్రప్రథమంగా ‘ఓం నమఃశ్శివాయ అని దిద్దిస్తారు. పంచభూతాలయిన జలము, వాయువ్ఞ, అగ్ని, ఆకాశం, పృథ్వి రూపంలో స్వామి చిదంబరం, కంచి, శ్రీకాళహస్తి, ఆరుణాచలం, జంబుకేశ్వరాలలో స్వామి దర్శనమిస్తాడు. శివ్ఞణ్ణి ఆరాధించే క్రమంలో అతి ప్రధానమైనది పంచాక్షరి మంత్రం. ఈ పంచాక్షరి మంత్రం సాకారుడయిన భగవానుని గురించి బోధిస్తుంది.

పంచాక్షరి మంత్రం నుండి అయిదు వర్ణాలతో కూడిన వర్ణమాల పుట్టింది. శిరోమంత్రమనే నాలుగవ పాదంతో సహా 3 పాదములు కలిగిన గాయత్రీ మంత్రం పుట్టింది. దాని నుండే సకల వేదాలు, ఆ వేదాల నుండే కోట్ల సంఖ్యలో మంత్రాలు, శ్లోకాలు ఏర్పడినాయి. ఒక్క మంత్రం వల్ల ఒక్క సిద్ధి మాత్రమే కలుగుతుంది. కానీ శివ పంచాక్షరీ మూలమంత్రం జపించటం వల్ల సర్వసిద్ధులు, సకల శుభాలు కలుగుతాయి. ఏది ఏమైనప్పటికీ పంచాక్షరి మంత్రాన్ని 5 కోట్లు జపించినట్లయితే ఆ సదాశివ్ఞనిలో ఐక్యం కావచ్చు. అంతటి పవిత్రత పంచాక్షరిలో దాగి ఉందని చెప్పటంలో అతిశయోక్తి లేదని చెప్పవచ్చని వేదాలు చెబుతున్నాయి.

మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే! అగ్రత శివరూపాయ శివలింగ నమోస్తుతే!! మూలము బ్రహ్మరూపంగాను, మధ్య భాగాన్ని విష్ణురూపంగాను, పై భాగాన్ని శివరూపంగను ఉండి త్రిమూర్తి స్వరూపమయినటువంటి శివలింగానికి నమస్కరించటంమని అర్ధం. నమః ప్రణవ వాచ్యాయ నమః ప్రణవ లింగనే! నమః సృష్ట్యాది కర్త్రేచనమః పంచముఖాయతే!! శివలింగము బిందునాదాత్మకము కాబట్టి అది జగత్కారణమయినది.

బిందువ్ఞ శక్తి. ఆ శక్తియే జగన్మాత. పరాశక్తి, నాదము శివ్ఞడు. ఆ శివ్ఞడే సృష్టికి మూలం, ఆధారం అయినటువంటి శివ్ఞడు, జగత్పతి. అటువంటి మాతాపితరులకు పరమానందం కలుగుట కొరకు లింగరూపముగనే పూజించినట్లయితే ఫలితం. ‘ఈశ్వరో ఐశ్వర్య అనగా ఈశ్వరుడే ఐశ్వర్యవంతుడని అర్ధం. ఎందుకంటే ఈశ్వరుడికి ఎలాంటి ఆడంబరాలుండవ్ఞ. అదేవిధంగా ఎవరయితే ఈశ్వరున్ని ఆరాధిస్తారో, పూజిస్తారో వారికి ఎలాంటి కష్టనష్టాలు రాకుండునట్లుగా ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు. కష్టాలు లేనివాళ్లే సుఖంగా, సంతోషంగా ఉంటారు. ‘ఈశ్వర అనగా ఐశ్వర్యవంతుడని అర్ధం. అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం అనే అష్టైశ్వర్యాలతో కూడిన శివ్ఞని బిందునాదాత్మకమగు లింగరూపంలో ఆరాధించిన వారికి తన మాదిరిగానే ఐశ్వర్యవంతులని చేస్తాడు. శివ్ఞన్ని ఆరాధిస్తే మోక్షం లభిస్తుంది. మోక్షం ఉన్నవారికి ఎలాంటి బాధలు, కోరికలు ఉండవ్ఞ.
‘ఓంకార మహిమ ఓంకార స్మరణతోనే మనిషి బ్రహ్మజ్ఞానాన్ని, మోక్షాన్ని పొందుతున్నాడు.
తిష్టంతం ప్రణవం ధ్యాయ బ్రహ్మిభూయాయ కల్పతే!!
ఓంకార ధ్యానం వల్ల సాధన చేసేవారు బ్రహ్మ భావాన్ని పొందేటటువంటి సామర్ధ్యం కలవాడగుచున్నాడు. ఓంకారమనేది సర్వదేవాత్మకం. ప్రశాంతత్వం, భూలోక, భువర్లోక, సువర్లోకాలలో ఉన్నదంతా తనలో కలిపేసుకుంది.

ఈ ఓంకారమే అహం (నేను), ఓంకారో హమేవ (ఈ అహమే ఆత్మ), ఆత్మయే పరమాత్మ – బ్రహ్మం. ఓంకారానికి ప్రణవ, ఉద్గధం, ఏకాక్షరం, తారకం, శబ్దబ్రహ్మం అనే నామాంతరాలున్నాయి కూడా. ఓం అనే అక్షరం త్రిమూర్త్యాత్మకమనీ, సృష్టి, స్థితి, లయలకు సంకేతమని, ఇందులో భగవంతుడి యొక్క సర్వ వ్యాపకత్వం, పోషకత్వం, యధార్థరూపం ఉన్నాయని ప్రతీతి. ఓంకారమనేది జ్ఞానం రూపంలో ఉండేటటువంటి చైతన్యం. సత్యస్వభావం దీనికి ఉన్న లక్షణం. పరమానందం ఓంకారం యొక్క పరమావధి. ‘ఓంకారం స్సర్వవేదానాం సారః తత్వ ప్రకాశకః తౌనచిత్త సమాధానం ముముక్షుణాం ప్రకాశ్వతే సర్వవేదాలకు మూలం, సారం, బ్రహ్మతత్వాన్ని ప్రకాశింపచేసేది ప్రతి దానికి సరైన సమాధానం చెప్పేది ఓంకారమే.

- శ్రీనివాస్‌ పర్వతాల 

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/