స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం

సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటన లో ఆరుగురు సజీవ దహనమయ్యారు. వీరంతా కాల్‌సెంటర్ ఉద్యోగులే అని తెలుస్తుంది. వీరి వయసు 20 నుంచి 24 ఏళ్లలోపే. మృతుల్లో నలుగురు యువతులు, ఇద్దరు యువకులు ఉన్నారు. 4వ ఫ్లోర్ లో స్పృహ లేకుండా పడి ఉన్న ఆరుగురిని అగ్నిమాపక సిబ్బంది గుర్తించింది. వీరిలో ఐదుగురిని గాంధీ ఆసుపత్రికి ఒకరిని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ ఆరుగురు చనిపోయారు.

మృతులను ప్రశాంత్, ప్రమీల, శ్రావణి, వెన్నెల, త్రివేణిగా గుర్తించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివ మరణించాడు. దట్టమైన పొగకు ఊపిరాడక ఆరుగురు మృతి చెందినట్లు నిర్ధారించారు. ముందుగా 8వ అంతస్తులో మొదలైన మంటలు ఆ వెంటనే 7,6,5 అంతస్తులకు వ్యాపించాయి. ప్రమాదం నుంచి మరో 12 మంది సురక్షితంగా బయటపడ్డారు. గత రాత్రి ఏడు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది భవనంలో చిక్కుకున్న వారిని స్కై లెవల్ క్రేన్‌ సాయంతో రక్షించి కిందికి దించారు. పలు అంతస్తుల్లోని అద్దాలను పగలగొట్టారు. అలాగే, చుట్టుపక్కల నివాసాల్లోని వారిని ఖాళీ చేయించారు.